Nizamabad Free Coaching Centre : తెలంగాణ ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమారు వెయ్యి మంది యువతీ యువకులకు పోలీస్ శాఖ కొలువుల కోసం నిజామాబాద్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గానికి చెందిన యువత కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో ముందస్తు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయించారు. 850 మంది స్క్రీనింగ్ టెస్ట్ రాయగా, వారిలో మెరిట్ ఆధారంగా 461 మందిని గ్రూప్ ఎగ్జామ్స్ ముందస్తు శిక్షణ కోసం ఎంపిక చేశారు. వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సోమవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.


నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి 
        
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజమాబాద్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబాల యువతకు కూడా న్యాయం జరగాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని అన్నారు. హైదరాబాద్ లో అందించే కోచింగ్ కు ఏమాత్రం తగ్గకుండా మరింత మెరుగైన మెటీరియల్ తో పాటు, నిష్ణాతులైన ఫ్యాకల్టీతో స్థానికంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని చెప్పారు. సుమారు 57 పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక యాప్ ను సిద్ధం చేయించామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతతో చదువుతూ ఉచిత శిక్షణ తరగతులను ఉద్యోగాలు సాధించేందుకు అనుకూలంగా మలచుకోవాలని హితవు పలికారు. జిల్లా నుంచి, బాల్కొండ నియోజకవర్గం నుంచి అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తమకు చెప్పలేనంత సంతృప్తి కలుగుతుందని, తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు అవుతుందన్నారు.


గతంలో అన్యాయం 


తెలంగాణ అనేక కుట్రలు పన్ని ఇదివరకు ఆంధ్రాలో విలీనం చేశారని, అప్పటి నుంచి తెలంగాణ ఉనికి మసకబారుతూ ఒక్కో రంగం ఆంధ్రా పాలకుల చేతుల్లోకి వెళ్తూ వచ్చిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కొల్లగొడుతూ వలస పాలకులు తెలంగాణను దుర్భర స్థితిలోకి నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల ఆలనా పాలనను విస్మరించారని, తెలంగాణలో సమకూరిన ఆదాయాన్ని ఆంధ్రా ప్రాంతం అభివృద్ధికి వినియోగించారని, చివరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ తెలంగాణ యువతకు హైదరాబాద్ ఫ్రీజోన్ వంటి జీవోలను తెరపైకి తెచ్చి అమలు చేసిన కారణంగా తీవ్ర అన్యాయం జరిగిందని ఆక్షేపించారు. 


స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు 


 వీటిని గమనించిన కేసీఆర్ మలి విడత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని మంత్రి గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో గడిచిన ఏడేళ్ల కాలంలోనే లక్షా 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం చేశామన్నారు. 2.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త పరిశ్రమలు ఏర్పాటవడం వల్ల ప్రైవేట్ రంగంలోనూ 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. తాజాగా 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు విడుదల చేయిస్తున్నారని చెప్పారు. కేవలం ఉద్యోగాల భర్తీయే కాకుండా, అవి స్థానికులైన తెలంగాణ బిడ్డలకే దక్కాలనే తపనతో ఏడాదిన్నరగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొలువుల భర్తీలో స్థానికత అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేయించారని అన్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే దక్కనున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయితే యువత స్థానిక కోటా ఉద్యోగాలతో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలను కూడా దక్కించుకుని జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలని సూచించారు.