నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ (BJP) ముఖ్య నాయకుల మధ్య విభేదాలు చల్లారటం లేదు. రోజురోజుకీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువవుతూనే ఉంది. గత పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లా బీజేపీ పార్టీలో ఒకింత జోష్ వచ్చింది. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ విజయం సాధించడంతో జిల్లా బీజేపీ పాలిటిక్స్ లో కాస్త ఊపు వచ్చింది. ఆ తర్వాత జరిగిన నిజామాబాద్ మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా కమలం పార్టీకి చెందిన 28 మంది కార్పొరేటర్లు గెలిచారు. పార్టీ జిల్లాలో బలోపేతం అవుతూ వస్తోంది. 


పార్టీ పరంగా అంతా బాగానే ఉన్నా జిల్లాకు చందిన ముఖ్య నేతల మధ్య పొసగటం లేదన్నది ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎంపీ అరవింద్ పార్టీలోకి రాకముందు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ జిల్లా బీజేపీలో పెద్దన్న పాత్ర పోషించారు. అరవింద్ ఎంట్రీతో ఈ ఇద్దరు నేతల మధ్య పోసగలేదన్నది ఆ పార్టీ వారే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. వీరి మధ్య అధిపత్య పోరు చిలికిచిలికి గాలి వానగా మారుతోంది. 


తాజాగా నిజామాబాద్ నగరంలో బోధన్ - నిజామాబాద్ రూరల్ నాయకులతో జరిగిన మీటింగ్ లో ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఎంపీ అరవింద్ వర్గానికి చెందిన ఇద్దరు నాయకులను స్టేజీ నుంచి కిందికి వెళ్లిపోవాలంటూ బస్వ లక్ష్మీనర్సయ్య చెప్పటంతో... ఈ విషయంపై అరవింద్ బస్వతో వారించినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య అధిపత్య పోరు బటయ పడిందని అనుకుంటున్నారు జిల్లా బీజేపీ క్యాడర్. 


జిల్లాలో బీజేపీ పార్టీ పుంజుకుంటున్నటువంటి సమయంలో కీలక నేతల మధ్య అధిపత్య పోరుతో క్యాడర్ లో గందరగోళం నెలకొంది. ఎందుకంటే... జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ, ఎంపీ అరవింద్ కు పొసగటం లేదన్న ప్రచారం, మరోవైపు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్యకు, పార్టీ ఎంపీ అరవింద్ కు మధ్య గ్యాప్ పెరుగుతోంది. దీంతో బస్వ లక్ష్మీనర్సయ్య యెండలతో సఖ్యతగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. మరోవైపు నిజామాబాద్ అర్బన్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ఎంపీ అరవింద్ తో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. 


యెండల లక్ష్మీనారాయణ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా ఎంపీ అరవింద్, ధన్ పాల్ వర్గీయులు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే అరవింద్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే... యెండల, బస్వ వర్గీయులు దూరంగా ఉంటున్నారు. బీజేపీనే నమ్ముకున్న కార్యకర్తల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల ఎవరి వద్దకు వెళ్లాలో ఎవరి వద్దకు వెళ్లోద్దో అన్న సంశయంలో ఉంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. మరికొంత మంది కూడా వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీని మరింత బలోపేతం చేయాల్సింది పోయి నేతల ఆధిపత్య పోరు వల్ల లీడర్లు, క్యాడర్ పార్టీకి దూరమవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. 


నిజామాబాద్ జిల్లాలో ముఖ్య నాయకులు కలిసికట్టుగా ఉండి క్యాడర్ లో జోష్ నింపాల్సింది పోయి ఇలా అధిపత్య పోరుకు పోతే జిల్లాలో బీజేపీకి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెకండర్ క్యాడర్ నేతలు. వర్గపోరుతో జిల్లా బీజేపీలోని ఇతర నాయకులు పక్క పార్టీల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం ఇకనైనా నేతలు తమ విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇకనైనా రాష్ట్ర అగ్రనేతలు జోక్యం చేసుకుని జిల్లా నేతల మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కోరుతున్నారు.