Nizamabad MP Dharmapuri Arvind | నిజామాబాద్: తెలంగాణలో కీలకమైన లోక్‌సభ స్థానాల్లో నిజామాబాద్ ఒకటి. బీజేపీ నేత, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బాండ్ అఫిడవిట్ ఇచ్చిన అర్వింద్ ఈసారి తన వ్యూహం ఏంటని అడిగితే సమయం వచ్చినప్పుడు తెలుస్తుందన్నారు. ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లలో పార్టీతో పాటు తన క్రెడిబిలిటీ పెరిగిందన్నారు. పసుపు బోర్డుకు టైమ్ పడుతుందని తెలియగానే, స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నామని స్పష్టం చేశారు. 


‘ప్రధాని మోదీ దయవల్ల స్పైసిస్ బోర్డు తెచ్చుకున్నాం. పసుపు ఉత్పత్తికి డిమాండ్ తీసుకురావడం, మార్కెటింగ్ ఎలా చేయాలి, 7 రైల్వే ఓవర్ బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. ఒకటి ప్రారంభించాం, మరొకటి సిద్ధంగా ఉంది. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు, మరికొన్ని పనులు, రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి. 2 కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయి. ఒకటి ప్రారంభమైంది. జగిత్యాలకు నవోదయ పర్మిషన్ వచ్చిందన్నారు’ ఎంపీ అభ్యర్థి అర్వింద్.


బీజేపీకి 12 సీట్లు..
తెలంగాణలో గత ఎన్నికల్లో సారు కారు పదహారు అన్నారు. మాకు 4 సీట్లు వచ్చాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో 12 సీట్ల వరకు నెగ్గుతామని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. కొందరు సింగిల్ డిజిట్ అన్నారు, కొన్ని సంస్థలు మాకు డబుల్ డిజిట్ వస్తుందని సర్వేలో వచ్చిందన్నారు. ఎవరిని, ఎప్పుడు ఎలా ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీని మళ్లీ చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోదీకి క్రేజ్ ఉంది. స్వయం సహాయక సంఘాలకు తన నియోజకవర్గంలోనే రూ.6300 కోట్ల రుణాలు. 70 వేల ఉజ్వల యోజన, 60 వేల సుకన్య సమృద్ధి యోజన, 6 లక్షల ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులు, 15 లక్షల 80 వేల మందికి ఉచిత రేషన్ వస్తుందన్నారు. 


నార్మల్ టైమ్ లో అభివృద్ది గురించి మాట్లాడతారు, ఎన్నికల సమయంలో మతతత్వ రాజకీయాలపై అర్వింద్ మాట్లాడారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 4 శాతం రిజర్వేషన్లు అని చెప్పి, ముస్లింలను బీసీల్లో చేర్చారని గుర్తుచేశారు. మత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. హిందువుల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వడం సరికాదన్నారు. ఎల్.కే అద్వానీ, వాజ్ పేయి హయాం నుంచి రామమందిరం బీజేపీ మేనిఫెస్టోలో ఉందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు బయటకు తీసి ప్రజలకు పంచాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లు బహిర్గతం చేయడంతో పారదర్శత పెరుగుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్లలో అత్యధిక వాటా బీజేపీకి వచ్చాయి. 


అదానీ ఆస్తుల విలువ 2004 - 2014 మధ్య భారీగా పెరిగిందని, కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని అర్వింద్ ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో కామన్ సెన్స్ లేదని, అందుకే అంబానీ, అదానీలను బీజేపీ తయారు చేసిందంటారని చెప్పారు. తెలంగాణలో 12 సీట్లు గెలిస్తే, కేంద్రంలో మరోసారి ఎక్కువ స్థానాల్లో నెగ్గితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుందా అని అడగగా.. ఇప్పుడు కూడా తమకు మెజార్టీ ఉన్నా ఆ పని చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి కాబోయే ఏక్ నాథ్ షిండే అనే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాని అడగాలన్నారు అర్వింద్. 



అప్పుడే కవితను అరెస్ట్ చేయకపోవడం మైనస్ అయింది


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకపోవడం వల్లే బీజేపీ ఓడిపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ, కేంద్రం ఆధీనంలో లేవన్నారు. బీజేపీ ఎంపీలు ఎందుకు అరెస్ట్ అవ్వరన్న దానిపై.. తమ పార్టీ నేతలు అవినీతి చేయరు కనుక జైళ్లకు వెళ్లరన్నారు. బీజేపీలో చేరిన సుజనా చౌదరి, ఎంపీ రమేష్ ల పైన ఉన్న ఈడీ కేసుల్లో ఎందుకు కదలిక లేదన్న ప్రశ్నకు.. ఏపీ సీఎం జగన్ పై కూడా ఈడీ కేసులు ఉన్నా.. ఆ కేసు కూడా మూవ్ కావడం లేదని గుర్తుచేశారు. ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పలేమని, అక్కడ ఏం సర్కస్ జరిగినా తమకు అవసరం లేదన్నారు. 


నిజాం షుగర్స్ కోసం ప్రైవేట్ వ్యక్తులను తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధిగా ఫిరోజ్ ఖాన్ కు ఛాన్స్ ఇస్తే 100 శాతం గెలిచేవారని జోస్యం చెప్పారు. ఒక్క ఓటు మీద వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది, కానీ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో సర్కార్ ను తాము కూల్చలేదన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారం కోల్పోతుందా అంటే బీజేపీ వస్తుందని అంటే తథాస్తు అన్నారు అర్వింద్.