TS EAPCET 2024 Exams: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించనున్న TS EAPCET -2024 పరీక్షలు మే 7 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 7 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించనుండగా; మే 9, 10, 11వ తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాలను మే నెలాఖరులో విడుదల చేయనున్నారు. ఎప్‌సెట్ పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. విభజన చట్టం జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది. అంతకంటే ముందే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయినందున ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.
ఏప్రిల్ 29న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల హాల్‌టికెట్లు అందుబాటులోకి తెచ్చిన జేఎన్‌టీయూహెచ్.. మే 1న ఇంజినీరింగ్ హాల్‌టికెట్లను విడుదల చేసింది. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తులు ఇలా..
ఈ ఏడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షలకు దాదాపు 3.50 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,50,600 (60 %) మంది అబ్బాయిలు దరఖాస్తు చేసుకోగా, కేవలం 1,03,862 (40 %) మంది అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అమ్మాయిలు 73,224 (73 %) మంది దరఖాస్తు చేసుకోగా.. అబ్బాయిలు కేవలం 27,003 (27 %) మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. గతేడాది కంటే ఈసారి ఇంజినీరింగ్‌కు దరఖాస్తుల సంఖ్య పెరిగితే.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మాత్రం తగ్గాయి.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
ఎప్‌సెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగానే వారికి కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలి. పరీక్షరాసే హాల్‌లోకి 90 నిమిషాల ముందు నుంచే అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. లేకపోతే చివరి నిమిషంలో పరీక్షాకేంద్రంలోకి వచ్చే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పరీక్ష హాల్‌లోకి వెళ్లిన తర్వాత వెరిఫికేషన్, బయోమెట్రిక్, కంప్యూటర్ అలాట్‌మెంట్‌కు కనీసం 20 నిమిషాలు పడుతుంది. దీంతో చివరి నిమిషంలో వచ్చేవారు ఈ సమయాన్ని నష్టపోతారు. ఇలాంటి వారికి ఎలాంటి అదనపు సమయాన్ని కూడా ఇవ్వరు. కాబట్టి వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూసుకోవాలి.
ఇంజినీరింగ్‌కు 166, అగ్రికల్చర్‌కు 135
ఈ ఏడాది ఎప్‌సెట్‌కు 35 వేలమంది అదనంగా దరఖాస్తు చేశారు. పెరిగిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని 20 పరీక్షాకేంద్రాలను పెంచాం. ఇంజినీరింగ్‌కు 166, అగ్రికల్చర్ ఫార్మసీకి 135 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశాం. తెలుగు, ఉర్దూల్లో ఏవైనా పొరపాట్లుంటే ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలనే ప్రామాణికంగా తీసుకొంటాం. విద్యార్థులు ఇంగ్లిష్ ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదివి సమాధానం ఇవ్వాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశాం. 74169 23578, 74169 08215 నంబర్లను సంప్రదించవచ్చు.
పరీక్ష కేంద్రాలివే...
ఎప్‌సెట్ పరీక్షల కోసం రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 135 కేంద్రాల్లో అగ్రికల్చర్, ఫార్మసీ; 166 కేంద్రాల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులలోని కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి.
పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉర్దూ మీడియం వారికి చివరి రోజు అయిన మే 12న పరీక్ష ఉంటుందని, వీరికి ఉర్దూ/ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.
20 శాతం ప్రశ్నలే కఠినంగా..
ఎప్‌సెట్ పరీక్షలో కేవలం 20 శాతం మాత్రమే ప్రశ్నల స్థాయి కఠినంగా ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందించనట్లు ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ తెలిపారు. మరో 40 శాతం ప్రశ్నలు సులభంగా, ఇంకో 40 శాతం ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ప్రశ్నలు కఠినంగా ఉంటాయేమోనని విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరంలేదని ఆయన భరోసా ఇచ్చారు. ఇంటర్‌బోర్డు సహా 15 బోర్డులకు చెందిన విద్యార్థులు ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేశారని వెల్లడించారు. తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొనే ఎప్‌సెట్‌లో ప్రశ్నలను రూపొందించినట్లు డీన్‌కుమార్ తెలిపారు.
విద్యార్థులకు ముఖ్య సూచనలు..
➥ ఈసారి పరీక్షల్లో తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలుచేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో జతచేసిన ఫొటోను, అభ్యర్థి ముఖంతో సరిపోల్చి లోపలికి అనుమతిస్తామన్నారు.
➥ పరీక్ష సమయానికి 90 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.
➥ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డు లేదా కాలేజీ ఐడీ కార్డును పరీక్ష రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ గుర్తింపుతోపాటు.. బయోమెట్రిక్ విధానంలో ఫోటో, కుడిచేతి వేలిముద్ర ద్వారా సరిపోల్చి లోపలికి అనుమతిస్తారు.
➥ అభ్యర్థులు హాల్‌టికెట్, ఆన్‌లైన్ దరఖాస్తు పత్రంతోపాటు ఒక ఫోటో, బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో విద్యార్థులు హాల్‌టికెట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.
➥ సెల్‌ఫోన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
➥ వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
➥ అభ్యర్థులు తమ చేతులపై గోరింటాకు, పచ్చబొట్లు ఉంటే అనుమతించరు.