నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంకు ఆయన ఫ్యామిలీ నుంచే ప్రమాదం ఉందని అన్నారు. కేసీఆర్ గత కొంత కాలంగా కనిపించడం లేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎమయ్యాడోనన్న పరేషానీ అందరిలోనూ ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉందని అన్నారు. 


కేసీఆర్ తర్వాత సీఎం పదవి కోసం హరీశ్ రావు, కేటీఆర్‌లు పోటీ పడుతున్నారు. తనకంటే జూనియర్ కేటీఆర్ సీఎం అవుతాడేమోనన్న ప్రస్టేషన్‌లో హరీశ్ రావు ఉన్నారని అన్నారు. అందుకే రైల్వే స్టేషన్‌లో పిచ్చోడి తరహాలో హరీశ్ రావు చిల్లరగా వ్యవహరించారని అన్నారు. కేటీఆర్‌ను కరవటం వలనే కుక్కలు పిచ్చిగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై ఎందుకంత ప్రేమ? ఉందో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి నాయకులను కేసీఆరే పంపిస్తున్నారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.


నిజామాబాద్ కు పసుపు బోర్డు రావడంతో ముఖం ఎక్కడ పెట్టుకోవాలో బీఆర్ఎస్ నేతలకు అర్థం కావటం‌ లేదని అర్వింద్ వ్యంగ్యంగా మాట్లాడారు. పసుపు బోర్డు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి చూపించామని చెప్పారు. పసుపు బోర్డుకు కేంద్ర కేబినెట్ నేడు ఆమోదం తెలిపిందని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల కల‌‌ మోదీ నెరవేర్చారని అర్వింద్ కొనియాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ చేస్తారని, గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళతారని అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం‌ చెప్పాలని ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.