బీఆర్ఎస్ నేతలకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వార్నింగ్ ఇచ్చారు. ప్రధాన మంత్రి మోడీని విమర్శించడంపై బీజేపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇంకోసారి ప్రధాని మోడీపై ఇస్టానుసారంగా మాట్లాడితే నాలుకలు మడత పెట్టి కుట్లేస్తానంటూ డీకే అరుణ హెచ్చరించారు. సన్యాసులు మాత్రమే తెలంగాణకు ప్రధానిని రావొద్దని అంటారని, కుల్వకుంట్ల ఫ్యామిలీని కంత్రీ కుటుంబమని విమర్శించారు. అక్కడితో ఆగని డీకే అరుణ సీఎం కేసీఆర్ కాదని, చీటర్ రావు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి కేటీఆర్ కాదని, కంత్రీ కార్యకలాపాలరావు అంటూ కొత్త పేరు పెట్టారు. 


వారిది ఫెవికాల్ బంధం
కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది విడదీయ లేని బంధమన్న ఆమె,  ఓటు నోటు కేసులో రేవంత్‌ను కాపాడుతున్నారని ఆరోపించారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్ పార్టీ,  ప్రజలకేమి గ్యారంటీ ఇస్తుందని ప్రశ్నించారు. ప్రధాని మోడీపై కేసీఆర్ కుటుంబం అహంకారపూరిత మాటలు దుర్మార్గమన్న డీకే అరుణ, తెలంగాణ ఎవరి జాగీరు కాదని, ‌. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికే బీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం రూ.9 లక్షల‌ కోట్ల నిధులిచ్చిందని, తెలంగాణ మోడల్ అంటే అవినీతి మోడల్ అని డీకే అరుణ ఆరోపించారు. 


అడ్డదారులు తొక్కే పార్టీ బీఆర్ఎస్ : లక్ష్మణ్
మరోవైపు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత, ఎంపీ బంగారు లక్ష్మణ్ ఖండించారు. ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలతో తెరచాటు ఒప్పందాలు, పొత్తులు పెట్టుకున్న బీఆర్ఎస్ కు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తుందని, అవసరాల కోసం అడ్డదారులు తొక్కే పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. 2018లో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇస్తుందని తాను చెప్పినట్లు కేటీఆర్ వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనన్న ఆయన, తప్పులను ఎత్తిచూపితే నిందలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలొస్తే ఏదో ఒక పార్టీతో లాలూచీ పడటం, కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం పొత్తుల డ్రామాలతో ఓట్ల రాజకీయం చేయడం బీఆర్ఎస్ నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఎంఐఎం పార్టీతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందన్న లక్ష్మణ్,  ఎన్నికల తర్వాత ఆ పార్టీతో కూటమిని ఏర్పాటు చేసిందని విమర్శించారు.


నిన్న మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే...
2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమని, అప్పటి  రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సంకేతాలు పంపారని మంత్రి కేటీఆర్ అన్నారు. డీల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే ఆయన అలా మాట్లాడారా ? కాషాయ పార్టీ ప్రతిపాదనను బీఆర్ఎస్ వెంటనే తిరస్కరించిందని స్పష్టం చేశారు. 105 స్థానాల్లో డిపాజిట్‌ కూడా రాని బీజేపీతో బీఆర్ఎస్ ఎందుకు కలుస్తుందని ప్రశ్నించారు. మేం పోరాడేవాళ్లమే తప్ప మోసం చేసే వాళ్లం కాదని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి కేటీఆర్. అయితే విపక్షాలు సైద్ధాంతిక విభేదాలు పక్కన పెట్టి మరీ కలిసి పనిచేశాయని గుర్తు చేశారు.