Telangana Election Shedule :  తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ పదో తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.   కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ బృందం ఇప్పటికే కసరత్తు పూర్తిచేసినట్టు సమాచారం. తెలంగాణతో పాటు రాజస్థాన్‌  , మిజోరం , ఛత్తీస్‌గఢ్‌ , మధ్యప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. 


పదో తేదీలోపు అన్ని పథకాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్       
 
కొత్తగా ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రక్రియ ఏదైనా మిగిలి ఉంటే, ఈ నెల 10లోపు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పాఠశాలల్లో దసరా రోజున ప్రారంభించాలను కున్న ‘సీఎం ఆల్ఫాహార పథకం’ ఈ నెల ఆరునే శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఉద్యగులకు ఇతర వర్గాలకు పెండింగ్ హామీలు ఉంటే వారిని క్లియర్ చేయాలనుకుంటున్నారు. పీఆర్సీని నియమించి ఐదు శాతం ఐఆర్ కూడా ప్రకటించారు. మరిన్ని పథకాలను అమలు చేయబోతున్నారు. మేనిఫెస్టో .. విపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటుందని హరీష్ రావు చెబుతున్నారు. 


బుధవారం వరకూ సమీక్షలు చేయనున్న ఈసీ                       


 ఐదు రాష్ట్రాలకు ఒకేసారి షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం సమాయత్తమైంది.  తెలంగాణకు వచ్చిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ సారథ్యంలోని 17 మంది అధికారుల బందం హోటల్‌ తాజ్‌కష్ణాలో బసచేసింది. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం కానుంది. కాగా, సీఈసీ బందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్నట్టు స్పష్టమైంది. సీఈసీ బందంలోని అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో సమావేశమవుతున్నారు.  ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ ఈ బందం ప్రత్యేకంగా సమావేశమవుతుంది.


ఈసీని కలిసి అభ్యంతరాలు చెబుతున్న రాజకీయ పార్టీలు                         


మరో వైపు రాజకీయ పార్టీల నేతలు హైదరాబాద్‌లో సీఈసీ బృందాన్ని కలిసి.. పలు అంశాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు సీఈసీ  బృందం దృష్టికి తీసుకెళ్లారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో  ఎన్నికలు జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు.  ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను తీసుకొచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుందని దీన్ని అరికట్టాలని  కోరారు.  హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారని గుర్తు చేశారు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాయనీ, వాటిపై సీరియస్‌గా వ్యవహరించాలని అన్ని పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు.