DA For TSRTC:

  
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సంస్థ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(Dearness allowance) అన్నింటినీ మంజూరు చేశారు. ఈ విషయాన్ని TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు. 2023 ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా ఉద్యోగులకు మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించినట్లు సజ్జనార్ వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు తాజా ప్రకటనలో తెలిపారు.  


టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని ఎండీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని పేర్కొన్నారు. టీఎస్ ఆర్టీసీ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో పెండింగ్ లో ఉన్న అన్ని డీఏలను ఉద్యోగులకు సంస్థ చెల్లించింది." అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ తెలిపారు.


గత నెలలో డీఏపై ప్రకటన..


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం ఇవ్వాలని TSRTC నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నట్లు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనర్ వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందని తెలిపారు.  


ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ 
దసరా, బతుకమ్మ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని TSRTC కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని భావిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ట్వీట్ చేశారు.


ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.