నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతున్న ఐటీ హబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఐటీ హబ్ భవనం అన్ని హంగులతో ముస్తాబైంది. 2016లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.25 కోట్ల రూపాయల నిధుల అంచనాతో ప్రారంభమై ఐటీ హబ్ భవనం పూర్తయ్యేసరికి రూ.50 కోట్ల నిధులు వెచ్చించింది ప్రభుత్వం. స్థానిక యువతకు ఐటీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని దీంతో నిజామాబాద్ నగరంలో ఐటీ హబ్ మంజూరైందని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త తెలిపారు. వివిధ దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు ఇక్కడికి రానున్నాయని అన్నారు. 


ప్రస్తుతం 40 కంపెనీలతో ఒప్పందం కుదిరింది. భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు వస్తాయని అన్నారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఐటీ హబ్ ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వెయ్యి మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయ్. పరోక్షంగా 4 వేల ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయ్. జనవరి చివరి వారంలో మొత్తం పనులు పూర్తవనున్నాయ్. జిల్లాకు చెందిన చాలా మంది ఇతర దేశాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్, ముంబయ్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో జిల్లా వాసులు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌తో స్థానికులకు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు దొరుకుతోంది. 


ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఐటీ హబ్ లు ఏర్పాటు చేయటంతో మంచి ఫలితాలనిచ్చాయ్. కొత్తగా నిజామాబాద్ తో పాటు మహబూబ్ నగర్ లో కూడా ఐటీ హబ్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ్. ఐటీ హబ్ ప్రారంభమవుతుండటంతో స్థానిక యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇతర నగరాల్లోకి వెళ్లే పని లేకుండా స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు చేసుకునేలా ఐటీ హబ్ ఏర్పాటు కావటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ హబ్ ప్రారంభమవుతే చాలా ఉపయోగాలుంటాయని నగరం మరింత అభివృద్ధి చెందుతోందని అంటున్నారు.