కామారెడ్డిలో మాస్టర్‌ ప్లాన్ మంటలు తీవ్రమయ్యాయి. రైతుల బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఆ పార్టీ సీనియర్ లీడర్‌ షబ్బీర్ అలీ రైతులతో కలిసి ధర్నాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి కూడా నేతలు, రైతులు యత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులను, నేతలను అడ్డుకున్న పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. 


ధర్నాను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. రైతులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా కామారెడ్డి వస్తారని తెలిపారు. ఈ రైతుల ఆగ్రహాన్ని తట్టుకోలేమని గ్రహించిన ప్రభుత్వం ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని హర్డిల్స్ దాటుకొని మూడు వాహనాలు మారుతూ తాను కామారెడ్డి చేరుకున్నట్టు షబ్బీర్ అలీ తెలిపారు. 


రైతుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు షబ్బీర్ అలీ. మంత్రి కేటీఆర్ స్పందించినా కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాత్రం బయటకు రాలేదన్నారు. వినతిపత్రం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కిసాన్ సర్కారు కాదని... కసాయి సర్కారుగా బీఆర్ఎస్ మారింది ఆరోపించారు. పోలీస్ జులుం విపరీతంగా పెరిగిపోయిందన్నారు. మాస్టర్ ప్లాన్ ఆఫీస్ దిక్కు లేదని... ప్రభుత్వం కానీ, లోకల్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా స్పందించడం లేదన్నారు. 


ఇండస్ట్రియల్‌ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాలకు భూములు తీసుకుంటున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. భూములను అమ్ముకుంటు 20 వేల కోట్ల వరకు వసూలు చేయాలని చూస్తున్నారన్నారు. తక్షణమే కేటీఆర్ స్పందించి అఫీషియల్ గా ప్రకటించాలి ఈ విషయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నుంచి ప్రకటన వచ్చే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని... ప్రతి జిల్లాలో మాస్టర్ ప్లాన్‌తో రియల్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. పోరాటం ప్రారంభం కాగానే భూములు పోవని కేటీఆర్ కానీ, ఎమ్మెల్యే కానీ చెప్పలేదన్నారు. 


మరోవైపు ఈ మాస్టార్ ప్లాన్‌లో భూములు కోల్పోతాయని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ బయల్దేరనున్నారని సమాచారం. ముందు జాగ్రత్తగా ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఆయన్ని వెళ్లనీయకుండా అడ్డుకునేందుకే పోలీసులు బండి ఇంటిని చుట్టుముట్టారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.