Nizamabad: తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఎక్కడికైనా వెళ్తే.. అందులోనూ ముఖ్యంగా తరచూ వెళ్లే ప్రాంతమైతే.. వారిని అలా కాసేపు వదిలేస్తుంటారు. తమ పని పూర్తి అయ్యాక లేదా పిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు వారిని దగ్గరికి తీసుకుంటారు. అయితే ఈ ధోరణి వల్ల కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడాల్సిన పరిస్థితి వస్తుంది. రెప్పపాటు కాలంలో కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకు వస్తుంది. అలాంటి ఓ ఘటన నిజామాబాద్ లో జరిగింది. అభం శుభం తెలియని ఓ చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోయింది. ఓ సూపర్ మార్కెట్ లోకి తండ్రితో పాటు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ల కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా.. విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే గమనించిన తండ్రి చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ నందిపేట్ లోని నవీపేటలో ఈ ప్రమాదం జరిగింది. అసలేం జరిగిందంటే...


నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవీపేటకు చెందిన రాజశేఖర్ తన నాలుగేళ్ల కూతురు రితీషతో కలిసి N సూపర్ మార్కెట్ వెళ్లారు. తండ్రి రాజశేఖర్ ఒక ఫ్రిడ్జ్ లో తనకు కావాల్సిన వాటి కోసం చూస్తున్న సమయంలోనే నాలుగేళ్ల రితీష.. పక్కనే ఉన్న మరో ఫ్రిడ్జ్ లో చాక్లెట్ల కోసం ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. అంతలో రుషితకు షాక్ తగలడంతో కదలకుండా అలాగే ఉండిపోయింది. చడీచప్పుడు కాకుండా ఉండిపోవడంతో.. పక్కనే ఉన్న తండ్రి కూడా వెంటనే స్పందించలేదు. తన పని పూర్తి చేసుకుని రితీషను గమనించి వెంటనే తనను లాగాడు. పాప స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉందని నందిపేట వైద్యులు చెప్పడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోగా పాప మరణించిందని బంధువులు తెలిపారు.


దీంతో చిన్నారి రితీష శవంతో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ వద్దకు తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. నవీపేట గ్రామానికి చెందిన సంయుక్త, శేఖర్ తమ కుమార్తె రితీషను తీసుకొని నందిపేట గ్రామంలోని అత్తమ్మ ఇంటికి వచ్చారు. అయితే ఈరోజు ఇంటికి వెళ్దామని అనుకొని మండల కేంద్రంలోని ఎన్ మార్ట్ లో షాపింగ్ చేసుకొని వెళ్దామని ఉదయం ఆరున్నర ప్రాంతంలో సూపర్ మార్కెట్ కు కూతురిని తీసుకొని వచ్చారు. షాపింగ్ చేస్తున్న సమయంలో రితీష ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేయబోయి కరెంటు షాక్ తో మృతిచెందింది. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులు, తల్లిదండ్రులు, మిత్రులు ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ ముందు ధర్నా చేపట్టారు. 


N మార్ట్ యజమానులు నిర్లక్ష్యమే కారణమా ?


ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లోని ఫ్రిడ్జ్ కరెంట్ షాక్ తగలడంతోనే చిన్నారి మృతిచెందడంతో.. తన మృతికి ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ యజమానుల నిర్లక్ష్యమే కారణమని చిన్నారు తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. ఫ్రిడ్జ్ ను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని.. తమకు న్యాయం చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. యజమానులు స్పందించక పోవడంతో అగ్రహంతో సూపర్ మార్కెట్ పై రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు.