నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం బుస్సాపూర్ లో జరిగిన బ్యాంక్ చోరీ అచ్చు జులాయి సినిమా సీన్ ను తలపిస్తోంది. పక్కా స్కెచ్. ముందస్తు రెక్కీ. గ్యాస్ కట్టర్స్. వర్షం పడుతున్న సమయం ఇలా అచ్చు సినీ ఫక్కీలో చోరీ. ఇప్పుడు ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఎక్కడా చిన్న క్లూ దొరకనివ్వకుండా పక్కా ప్లాన్ తో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పూర్తిగా రెక్కి నిర్వహించే ఈ దొంగతనం జరిగి ఉండొచ్చన్న భావన కలుగుతోంది.


భారీ మందంగా ఉండే ఇనుప లాకర్లు అంత ఈజీగా పగలవు. గ్యాస్ కట్టర్ సాయంతోనే చోరీ జరిగింది. చడి చప్పుడు కాకుండా... స్కూల్ గ్రౌండ్ నుంచి బీఎస్ ఎన్ ఎల్ పాత ఎక్చెంజ్ భవనంలోకి చేరుకుని ట్రాక్టర్ ఇనుప కర్రు చక్రాల సాయంతో గోడ దూకి బ్యాంక్ లోకి చొరబడ్డారు. బ్యాంకు ముందు నుంచి వస్తే సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని వెనుక వైపు నుంచి పక్కా ప్లాన్ తో చోరీకి తెగబడ్డారు. ఎక్కడ కూడా క్లూ దొరక్కుండా చోరీ చేశారు. సాంకేతికంగా బ్యాంకు లాకర్ల వద్దకు వెళ్లిగానే బ్యాంకు మేనేజర్ కు, బ్యాంకు పరిధిలోని పీఎస్ కు మెసేజ్ వెళుతుంది. అలా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటన్నింటినీ ఆపేసి రాబరీ చేశారు. బ్యాంకులో ఉన్న సీసీ కెమెరా సిస్టమ్ ను కూడా ఎత్తుకెళ్లిపోయారు. 


జులాయ్ సినీమా సీన్ తరహాలో....


జులాయి సినీమాలో ఎలాగైతే చోరీ చేస్తారో ఇక్కడా అదే సీన్ రిపీట్ అయ్యింది. సరిగ్గా వర్షం పడుతున్న సమయంలోనే చోరీ జరిగినట్లు తెలుస్తోంది. భారీగా ఇనుప చువ్వలు, మందంగా ఉండే ఇనుప లాకర్లను సైతం ఈజీగా గ్యాస్ కట్టర్స్ తో కట్ చేసి నగదు, బంగారం దోచుకెళ్లారు. బ్యాంకులో కనీస క్లూ కూడా దొరకని పరిస్థితి. అయితే వీరు అంతర్రాష్ట్ర దొంగలే అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఈ బ్యాంకు రాబరీలు ఎక్కువగా హైవేలకు దగ్గరగా ఉన్న బ్యాంకుల్లోనే జరుగుతున్నాయ్. ఇటీవల సిద్ధిపేట్ మండలం కుక్కునూరు పల్లిలో సైతం బ్యాంక్ లో చోరీ జరిగింది. అయితే అక్కడా కూడా ఒక ఫేస్ మాస్క్ వదిలేశారు. బుస్సాపూర్ లో చోరీ జరిగిన బ్యాంక్ లో సైతం  ఫేస్ మాస్క్ వదిలివెళ్లారు దొంగలు. కొన్ని రోజుల కిందట ఇందల్ వాయ్ లో కూడా హైవే పక్కన  ఉన్న ఏటీఎంను దొంగలించారు. ఆ కేసు ఇప్పటి వరకూ పోలీసులు ఛేదించలేదు. 


పోలీస్ లకు సవాల్ గా మారిన బ్యాంక్ రాబరీ


బుస్సాపూర్ బ్యాంకులో జరిగిన చోరీ ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది. ఇందల్ వాయి లో హైవే పక్కన గల ఏటీఎం చోరీలో కూడా పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఇంకా ఆ కేసును పోలీసులు ఛేదించలేదు. అయితే చోరీ చేసిన వారు హర్యానా కు చెందిన వారిగా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన బ్యాంక్ రాబరీలో ఒక్క క్లూ కూడా పోలీసులకు దొరకలేదు. నాలుగేళ్ల కింద కోటగిరి మండలం పొతంగల్ లో ప్రైవేటు బ్యాంకు ఏటీఎం లూటీ చేశారు. కోటగిరిలో సైతం రెండు ఏటీఎంలను గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి నగదు చోరీ చేశారు. ఈ కేసులను పోలీసులు ఇప్పటికీ ఛేదించలేదు. ఇది పక్కా స్కెచ్ తో జరిగిన చోరీ. బుస్సాపూర్ లో వరి కోతల సమయంలో హార్ వెస్టర్స్ వస్తాయ్. హార్ వెస్టర్స్ ను నడిపేవారు దాదాపు ఇతర రాష్ట్రాల వారే ఉంటారు. వారిలో ఎవరైనా రెక్కీ నిర్వహించి ఉంటారా అన్న అనుమానాలు రాకపోలేదు. ఈ తరహాలో చోరీ జరిగిందంటే పూర్తిగా అవగహన ఉన్న వారికే సాధ్యం అంటున్నారు. 


రంగంలోకి నాలుగు పోలీస్ బృందాలు


బుస్సాపూర్ బ్యాంక్ రాబరీ కేసును ఛేదించేందుకు ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ నేతృత్వంలో 4 టీంలను ఏర్పాటు చేశారు. ఈ నాలుగు బృందాలు వివిధ కోణాల్లో కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తానికి ఈ బ్యాంకు రాబరీ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. హైవే లకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోని బ్యాంకుల్లో పటిష్ట నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.