బంగారు ఆభరణాలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న లేడీ కిలాడీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. మహిళ హ్యాండ్ బ్యాగులు, బంగారు ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్న బసనబోయిన యాదలక్ష్మి పోలీసులకు చిక్కింది. నిజామాబాద్ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో నివసిస్తోందామె. వృత్తిపరంగా కూలీ చేసుకుంటుంది. ఆ డబ్బులు సరిపోవటం లేదనుకుని దొంగతనాలు చేయటం మొదలు పెట్టింది. మహిళలనే టార్గెట్ గా పెట్టుకుంది.
నిజామాబాద్ నుంచి రోజు ఉదయం ఆర్మూర్ బస్టాండ్ కు చేరుకుంటుంది. ఆర్మూర్ లోని ఆర్టీసీ బస్టాండ్ లో గత కొన్ని రోజులుగా చోరీలకు పాల్పడుతోంది. ప్రయాణికులు బస్సు ఎక్కే క్రమంలో హ్యాండ్ బ్యాగ్ లో బంగారు ఆభరణాలను దొంగిలిస్తోంది. ఇలా తమ బంగారు ఆభరణాలు చోరీకి గురైన వ్యక్తులు ఆర్మూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆర్మూర్ బస్టాండ్ వద్ద మఫ్టీలో ఉండి దొంగను గుర్తించే పనిలో పడ్డారు. ఈనెల 4వ తేదీన సాయంత్రం ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న యదలక్ష్మిపై పోలీసులు నజర్ పెట్టారు. ఆమెను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు చెప్పేసింది.
ఆర్మూర్ పీఎస్ లో సీపీ నాగరాజు ప్రెస్ మీట్ లో తెలిపిన వివరాల ప్రకారం... యాదలక్ష్మిపై ఇప్పటికే 14 చోరీ కేసులు ఉన్నాయని... నిందితురాలి వద్ద నుంచి 55 తులాల బంగారు అభరణాలను రికవరీ చేసినట్టు తెలిపారు పోలీసులు. వాటి విలువ 27 లక్షల 50 వేల రూపాయలు. గతేడాది నవంబర్ నుంచి యాదలక్ష్మి ఆర్మూర్ బస్టాండ్ లో ప్రయాణికులు బస్సు ఎక్కే క్రమంలో హ్యాండ్ బాగుల్లో ఉండే ఆభరణాలను చోరి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన బంగారంలో కొన్నింటిని తన వద్దే ఉంచుకుని మరి కొంత బంగారాన్ని నిజామాబాద నరగంలోని ఫైనాన్స్, బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు నిందితురాలు పోలీసు విచారణలో తెలిపింది. ఇప్పటి వరకు 14 దొంగతనాలకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకుంది. ఆర్మూర్ బస్టాండ్ లో ఇలా వరుసగా చోరీలకు గురవుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ చోరీలకు గురైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ లేడీ కిలాడీ దొంగ గుట్టు రట్టైంది. యాదలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలియగానే ప్రయాణికులకు ఊరట కలిగినట్లైంది.