Pre Examination Training Program: తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లు రాగా, వాటి పరీక్షా తేదీలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తేదీని కొన్ని రోజుల కిందట ప్రకటించగా.. ఆగస్టులో పోలీస్ ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెల్లడించింది. అయితే ఉద్యోగ నియామకపు పోటీ పరీక్షలకు యువత ప్రణాళిక బద్ధంగా సన్నద్ధం కావాలని, నిరాశ నిస్పృహలకు లోను కావొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మిత సబర్వాల్ సూచించారు. ఇతర కెరీర్ పై సైతం ఫోకస్ చేయాలని, ఏదో ఓ రంగంలో విజయాన్ని సాధిస్తారని చెప్పారు.


ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని పల్లిపట్టి కేంద్రం, గిరిజన యువజన శిక్షణ కేంద్రం, కొలాంగూడా అంగన్వాడీ కేంద్రం, దంతన్ పల్లి ఆరోగ్య కేంద్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సోమవారం స్మితా సబర్వాల్ సందర్శించారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని పల్లిపట్టి కేంద్రాన్ని సందర్శించి పల్లిపట్టి తయారీ విధానాన్ని, కావలసిన ముడి సరుకులు వంటి వివరాలను మార్కెటింగ్ జెడీని అడిగి తెలుసుకున్నారు. తయారీ కేంద్రంలో పనిచేస్తున్న వారి వివరాలు తెలుసుకొని సిబ్బందితో ఫోటో దిగారు. 


గిరిజన యువజన శిక్షణ కేంద్రం సందర్శణ..
అనంతరం గిరిజన యువజన శిక్షణ కేంద్రాన్ని సందర్శించి గ్రూప్స్, పోలీస్ ఉద్యోగ నియామకం కోసం శిక్షణ పొందుతున్న యువతులతో స్మితా సబర్వాల్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి రోజు దినపత్రికలు చదవడం ద్వారా దేశవిదేశాలు, రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకోవాలని చెప్పారు. ఫ్యాకల్టీ బోధించిన వాటిని ప్రణాళిక బద్ధంగా రివిజన్ చేసుకోవడం ద్వారా పరీక్షలో ప్రగతి సాధించవచ్చని అన్నారు. ఈ 2, 3 నెలల కాలంలో చేసే కృషిపై మీ 20 నుండి 30 సంవత్సరాల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. మనసు పెట్టి చదువుకోవాలని, చదువుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలలో అర్హత సాధించక పోయినప్పటికీ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఇతర కెరీర్‌పై ఫోకస్ చేయాలన్నారు. సాధన చేయడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. 

గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చాంగ్ధు మాట్లాడుతూ.. నమ్మకంతో ముందుకు సాగాలని, తద్వారా విజయం సాధించవచ్చని, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 200 మంది మహిళా అభ్యర్థులు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారని, ప్రస్తుతం 160 మంది విద్యార్థులు శిక్షణ అభ్యసిస్తున్నారని తెలిపారు. ఉదయం 5 గంటల నుండి ఫిజికల్ ఫిట్ నెస్‌తో ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు 12 అంశాలపై ఆయా ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. మహిళా అభ్యర్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. అంతకుముందు పలువురు మహిళా ఉద్యోగార్థులు వారి మనోభావాలను, లక్ష్యాలను వివరించారు.