అనంత పద్మనాభస్వామి లీలలు అనంతం అంటారు. చిన్నరూపాయి బిళ్ల సైజులో మెరుపులా మెరిసి.. ఓ బండరాతిపై స్వయంభువుగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అనంత పద్మనాభ  స్వామి ప్రస్తుతం నృసింహుడి అవతారంలో దర్మనిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం విశిష్టత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.


నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ గ్రామంలో స్వయంభుగా వెళిశారు అనంతపద్మనాభ స్వామి. ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. 600 ఏళ్ల క్రితం ఇక్కడ స్వామి వారు వెళిశారని చరిత్ర చెబుతోంది. వికారాబాద్ ప్రాంతం నుంచి మాకునూరి కోనమాచారి అనే బ్రాహ్మణుడు ఎడ్లబండిపై ప్రయాణం చేస్తూ ఉండగా.. ఆయనకు కలలో అనంతపద్మనాభ స్వామి వచ్చి నేను మీరు వెళ్లే మార్గంలో ప్రత్యక్షమవుతాను.. ఓ తెల్లని అశ్వంమీకు కనిపిస్తుంది. ఆ అశ్వాన్ని వెంబడించండి అది ఎక్కడ ఆగుతుందో అక్కడే నేను కొలువుదీరుతాను అని మాకునూరి కోణమాచారికి స్వామి వారు స్వప్నంలో చెప్పారు. కోనమాచారి లక్ష్మాపూర్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. 


గాంధారి వంశస్థులైన తన శిశ్యులకు విషయాన్ని చెప్పారు. స్వామి స్వప్నంలో చెప్పిన విధంగానే ఓ తెల్ల గుర్రం కోనమాచారికి కనిపించింది. శిశ్యులతో ఆ అశ్వం వెళుతున్న వైపు పరిగెత్తారు. గుండారం చెరువు వద్ద గుహలోకి వెళ్లిన అశ్వం మాయమైంది. కోనమాచారికి ఆ గుహలో రూపాయి బిళ్ల సైజులో ఓ వెలుగు కనిపించింది. ఆ వెలుగు మాయం కాగానే కోనమాచారికి నేనే అనంత పద్మనాభ స్వామిని ఇక్కడ నేనే కొలువుదీరుతున్నాను అన్న మాటలు వినిపించాయి. నాటి నుంచి అక్కడ పూజలు, అర్చనలు ప్రారంభించారు. రూపాయి సైజులో ఉన్న స్వామి వారు దినదినమూ పెరిగి ప్రస్తుతం నరసింహ స్వామి ఆకారంలో దర్శనమిస్తున్నారు.


దాదాపు 600 సంవత్సరాల నుంచి మాకునూరి వంశస్తులే ఈ ఆలయంలో అనంతపద్మనాభ స్వామికి పూజలు, అర్చనలు చేస్తున్నారు. మాకునూరి వంశస్తులు ఇప్పటికీ ఎనిమిదో తరం స్వామివారి సేవలో తరిస్తున్నారు. కొండగుహలో వెలిసిన స్వామి వారి విగ్రహం పెరుగుతూ వస్తోందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. భక్తులకు స్వయంభువుగా వెలిసిన స్వామి వారిని కింది నుంచే దర్శనం చేయిస్తున్నారు. స్వామి వారికి అర్చనలు చేయటానికి అనంతపద్మనాభ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మెట్ల మార్గంలో వినాయకుడు ఉంటారు. అక్కడన గణపతిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు.


ఆలయం చుట్టూ ప్రకృతి సోయగం, గుండారం చెరువు అహ్లాదాన్ని కలిగిస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి ఇక్కడికి వచ్చే భక్తులకు ఆనందాన్నిస్తుంది. ప్రతి శనివారం ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. స్వామివారి ఆలయ ప్రాంగణం వద్ద సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయంటారు. 


పద్మనాభస్వామి విగ్రహం ఏటా పరిమాణం పెరుగుతూ వస్తుండటంతో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. 5 గ్రామాల ప్రజలు కలిసి ఏటా ఫిబ్రవరి మాసంలో కన్నుల పండగగా ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు. నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, అటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతగిరి, మల్కాపూర్, దర్మారం, జలాల్ పూర్, గుండారాం గ్రామాలకు చెందిన ప్రజలంతా కలిసి ఈ అనంతపద్మనాభ స్వామి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏటా ఒక గ్రామం నుంచి నిర్వహణ బాద్యతలు తీసుకుంటారు. ప్రజలు స్వచ్చందంగా ఇచ్చిన విరాళాలతోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి.


అయితే, ఇప్పటి వరకు దేవాదాయ అధికారులు కాని ఇటు పురావస్తు శాఖ అధికారులు కాని పట్టించుకున్నపాపాన పోలేదని అన్నారు. భక్తులకు సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఆలయం అభివృద్ధితో పాటు ఇక్కడ పర్యాటకంగా కూడా ఎంతో అభివృద్ధి చేయవచ్చంటున్నారు భక్తులు. ఇకనైనా ప్రజా ప్రతినిధులు ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నారు. భక్తులు ఇచ్చే విరాళాలతోనే ఆలయ అభివృద్ధి చేస్తున్నారు.


Also Read: Nizamabad: బోధన్‌లో కల్తీ కల్లు కలకలం.. జాతరలో సంబరాలు చేసుకున్నారు.. గంటల వ్యవధిలో ఆస్ప్రత్రిపాలు


Also Read: Kunrool Call Money: కర్నూలు జిల్లాలో కాల్ మనీ కలకలం... వడ్డీ వ్యాపారులు వేధింపులతో భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం  


Also Read: Drugs in Gujarat: గుజరాత్‌లో మరోసారి మత్తు భూతం.. పాక్ బోటులో రూ.400 కోట్ల డ్రగ్స్ సీజ్




 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి