నిర్మల్ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం బాసర దేవాలయం ఎంతో ప్రసిద్దిగాంచింది. సరస్వతి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. భారత దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి వస్తారు. అమ్మవారిని దర్శించుకుంటారు. చదువుల తల్లి ఒడిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. గలగల పారే గోదారమ్మ నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఉంటుంది. బాసర అమ్మవారి ఆలయం వెనుక భాగంలో బాసర గ్రామంలోని బస్టాండ్ వద్ద అచ్చు లంకెబిందె ఆకారంలో ఉండే రాయి ఇది. దీన్ని వేద శిలగా పిలుస్తారు.
బాసర గ్రామస్తులు దీన్ని కన్ కన్ బండ అంటారు. సరస్వతి అమ్మవారి ఏడు వారాల నగలు ఈ బిందే ఆకారంలో ఉన్న శిలలో ఉంటాయన్నది చరిత్ర. సప్త స్వరాలు పలికించే ఈ మ్యూజికల్ స్టోన్ భక్తులను ఆకర్శిస్తోంది. బాసరకు వచ్చే భక్తులు తప్పకుండా ఈ మ్యూజికల్ స్టోన్ వద్దకు వెళ్లి ఆ సప్త స్వరాలను వింటారు. ఈ బండరాయిని మరో రాయితో కొడితే స్వప్తస్వరాలు పలుకుతాయి. రాయితో కొట్టగా వచ్చే శబ్దం కన్ కన్ అని వస్తుంది. అచ్చు బిందెను కొడితే ఎలా శబ్ధం వస్తుందో అలా ఈ బండరాయిని కొడితే శబ్దం వస్తుంది. ఇదో అద్భుతంగా చెప్పుకుంటారు. అమ్మవారి దర్శనం తర్వాత భక్తులు తప్పకుండా వేద శిల వద్దకు వెళ్లి ఆ శబ్దాలను వింటూ తరిస్తారు. అయితే ఈ బిందేె ఆకారంలో ఉన్న బండలో సరస్వతి అమ్మవారి ఏడు వారాల నగలు సాక్షాత్తు చదువుల తల్లి పెట్టేవారని చరిత్ర చెబుతుందన్నది బాసర గ్రామస్థుల నమ్మకం. నిజంగా ఆ బండరాయిని వచ్చే స్వరాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.
అభివృద్ధికి నోచుకోని వైనం
అయితే ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వేదశిల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం లేదన్నది ఇక్కడికి వచ్చే భక్తుల వాదన. కనీసం పరిసరాలు శుభ్రం చేసే వారు కూడా కరవయ్యారు. వేదశిలను మరింత అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇక్కడ పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు బాసర గ్రామస్థులు. తరతరాలుగా ఈ వేదశిల అలాగే ఉంది. ఇదో పెద్ద అద్భుతం అంటున్నారు. ఇంతటి చరిత్ర కలిగిన ఈ వేదశిల వద్ద పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన నాయకులు, ఆలయ కమిటీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదంటున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను ఆకర్షిస్తున్న వేద శిల వద్ద కనీస సౌకర్యాలు కరవయ్యాయని గ్రామస్తులు చెబుతున్నారు. వేద శిలను చూసేందుకు వచ్చే భక్తులు ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఇకనైనా వేదశిల వద్ద అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు బాసర గ్రామస్థులు, పర్యాటకులు.