Nirmal Latest News: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్,రాంపూర్ పునరావాస గ్రామాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. 94 మంది లబ్ధిదారులకు ఇక్కడ వ్యవసాయ భూములు కేటాయించింది. దీన్ని నచ్చన్ ఎళ్లాపుర్ గొండ్ గూడ రైతులు వ్యతిరేకించారు. వ్యవసాయ భూముల పంపిణీలో అటవీ,పోలీస్,రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి, ఎంపీడీవో రేవంత్ చంద్ర ఆధ్వర్యంలో అటవీ అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి పంపిణీకి సిద్ధమయ్యారు. కేటాయించడానికి గుర్తించిన రెవెన్యూ భూములకు హద్దు రాళ్ళు వేసేందుకు అధికారులు వచ్చారు. అక్కడ నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ భూములు తమవని కష్టపడి సాగచేసుకున్నామని అధికారులకు తెలియజేశారు. ఈ భూముల జోలికి రావద్దంటూ రెవెన్యూ, అటవీ అధికారుల కాళ్ళు మొక్కేందుకు కాళ్ళ మీద పడ్డారు.
అటవీ అధికారులు టైగర్ జోన్ పరిధిలో ఖాళీ చేసిన రాంపూర్, మైసంపేట పునరావాస గ్రామస్తులకు కేటాయించారు. ఈ భూమిని సాగుచేస్తున్న తమపై అటవీ భూమి అని కేసులు పెట్టారని తెలియజేశారు. ఈ భూమికి తామే అర్హులమని, పంటలు వేస్తే తమకే ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది.
కేటాయించిన భూముల హద్దులు చూపెడతాము రమ్మని పిలవడంతో మైసంపేట్, రాంపూర్ ప్రజలు వచ్చారు. అధికారుల చర్యలు అడ్డుకోవడానికి నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజన రైతులు వచ్చారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులు చెప్పినా వినకపోవడంతో రెండు రోజుల తర్వాత మళ్లీ హాద్దుల ఏర్పాటు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం అందరూ వెనుదిరిగారు.