Telangana New Medical College: తెలంగాణలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు సర్కారు సిద్ధం అయింది. ఈక్రమంలోన క్యాబినెట్ కూడా సోమవారం రోజు అనుమతి ఇచ్చింది. తద్వారా దేశ వైద్య రంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. తాజాగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మెడికల్ కాలేజీక ఏర్పాటుకు అనుమతి ఇస్తూవైద్యారోగ్య శాఖ ఈనెల 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది నుంచి ఒక్కో కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా అవసరం అయిన చర్యలు తీసుకోబోతున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పది వేలకు చేరువ కానుంది. 


10 వేలకు చేరుకోబోతున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య


తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. 2016వ సంవత్సరంలో మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో కళాశాలలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. 2018-19 సంవత్సరంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చింది. గతంలో కేవలం 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 10 వేలకు చేరబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ఏర్పాటుకు ముందు మెడికల్ కాలేజీలలో 15 శాతం అన్ రిజర్వుడు కోటా కింద 280 సీట్లు కేటాయించేవారు. ఈ సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు కేటాయించేవారు. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం వైద్య విద్య అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్ రూల్స్ సవరించారు. 


వైద్య విద్య కల సాకారం అయ్యే అవకాశం


ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్, ప్రకరణ 371 డి నిబంధనల్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర ఏర్పాటు తరువాత ఏర్పాటైన మెడికల్ కాలేజీలలో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. గతంలో 15 శాతం అన్ రిజర్వుడు సీట్లతో ఏపీ విద్యార్థులు సీటు సాధించడంతో తెలంగాణ విద్యార్థులు నష్టపోయేవారు. ఇప్పుడు వాటికి కేసీఆర్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు రాష్ట్ర  విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసింది ప్రభుత్వం. దాంతో  తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 15 శాతం సీట్లు అన్ రిజర్వుడు సైతం తొలగించడంతో అదనంగా 520 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కనున్నాయి. ఓవరాల్ గా 1820 సీట్లు తాజాగా అందుబాటులోకి రానుండగా, రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కల సాకారం అవుతుందని తెలుస్తోంది.