Nagoba Jathara 2023: నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు ప్రధాన ఘట్టాన్ని పూర్తి చేశారు. నాగోబా అభిషేకం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరి హస్తలమడుగులో పవిత్ర జలాన్ని సేకరించి ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా మెస్రం వంశీయులు పిల్లాపాపలతో ఎడ్లబండ్లపై తరలి వచ్చారు. ఇంద్రాదేవికి ప్రత్యేక వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మెస్రం వంశ కుటుంబీకులు సహపంక్తి భోజనాలు చేసి డోలువాయిద్యాల నడుమ కేస్లాపూర్ లోని మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. 




ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈనెల 21న ప్రారంభమయ్యే నాగోబా జాతర కోసం మెస్రం వంశీయులు ఏటా సాంప్రదాయ రీతిలో నిర్వహించే పూజల కోసం సిద్దమయ్యారు. నాగోబా అభిషేకం కోసం పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు జనవరి 1న కేస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరి 10వ తేదిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరిలో గల హస్తలమడుగు వద్ద పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరి ఈనెల 17న ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. వారితో పాటు మెస్రం వంశ కుటుంబాలు వారం రోజుల పాటు కేస్లాపూర్ జాతరలో ఉండేందుకు అన్నివిధాల ఏర్పాట్లు చేసుకొని ఎడ్లబండ్లపై తరలివచ్చారు. ఇంద్రవెల్లిలో ఇంద్రాదేవి ఆలయ సమీపంలో గల మర్రిచెట్టుపై పవిత్ర జలం తీసుకొచ్చిన కళిశం (ఝారీ) ని పెట్టారు. అనంతరం ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. 




పవిత్ర గంగాజలం కోసం తమ పాదయాత్ర సాఫిగా క్షేమంగా జరిగింది. ఇక్కడి నుంచి కేస్లాపూర్ కు క్షేమంగా చేరుకొని, సాంప్రదాయ ఆచార అన్ని కార్యక్రమాలు చేసి నాగోబా మహాపూజ చేయటానికి దేవుడు ఆశీస్సులు ఉండాలని ఇంద్రాదేవికి మొక్కులు సమర్పించారు. డోలు వాయిద్యాలతో ఇంద్రా దేవికి ప్రత్యేక పూజలు చేసి.. మహిళలు తయారు చేసిన నైవేద్యం సమర్పించారు. కొంతమంది కోళ్లు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రాదేవి ఆలయ ప్రాంగణంలో రోజంతా బసచేసి మహిళలు ప్రత్యేక వంటకాలు చేశారు. సాంప్రదాయ రీతిలో మినప పప్పును రుబ్బి మరీ గారెలు తయారు చేశారు. స్వచ్చమైన నువ్వుల నూనెతోనే ఈ వంటకాలు చేయడం ఆనవాయితీగా వస్తోందని మెస్రం వంశ మహిళలు ఏబీపీతో తెలిపారు. మరికొందరు దంపుడు బియ్యంతో తీపి ప్రసాదం, గోదుమ పిండితో తియ్యటప్పాలు తయారు చేశారు. 





ఇక్కడ వండిన ప్రతి వంటకాన్ని మహిళలు ముందుగా ఇంద్రాదేవికి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. ఆపై అంతా కలిసి అంటే కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. ఇంద్రాదేవి ఆలయానికి ఉదయం పూట వచ్చిన మెస్రం వంశ కుటుంబీకులు సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సాయంకాలం వేళ కేస్లాపూర్ పయనమయ్యారు. పవిత్ర జల ఝారిని తీసుకొని మెస్రం వంశీయులు ఎడ్లబండ్లపై వచ్చిన వారిని ముందుగా సాగనంపి వారి వెంటనే వెనుక దిశగా బయలుదేరి కేస్లాపూర్ లోని మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. మర్రిచెట్ల కింద నాలుగు రోజుల పాటు అక్కడే బస చేసి సాంప్రదాయ కార్యక్రమాలు చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం పూట నాగోబా ఆలయానికి పవిత్రజల ఝారితో చేరుకొని అర్థరాత్రి పవిత్ర జలంతో నాగోబాను అభిషేకించి మహాపూజ చేయనున్నారు. మహపూజ అనంతరం నాగోబా జాతర ప్రారంభం కానుంది. నాగోబా మహాపూజ కోసం మెస్రం వంశ కుటుంబీకులు ఎడ్లబండ్లపై పెద్దఎత్తున తరలివస్తున్నారు.