BRS Ex MLA Balka Suman | మంచిర్యాల: కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనతో అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఆగం అయిందని మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. మంచిర్యాల (Mancherial) జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాక సమీక్ష సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్ కాంగ్రెస్ విధానాలపై మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ట్రైనింగ్ మాడ్యూల్లో భాగంగా గత బిఆర్ఎస్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితిపై ఎల్ఈడి స్క్రీన్ ద్వారా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ విధానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడిందని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవ చేశారు. గత బిఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ ఎట్లుండే, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ పరిస్థితి ఇలా దిగజారిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అప్పుడే బాగుండే తెలంగాణ కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్తున్నామని ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమం మొదటగా చెన్నూరులోనే పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి

రైతులకు రుణమాఫీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశాడని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గడిచిన 20 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన అప్పుడే మంచిగుండే కార్యక్రమం విజయవంతంగా కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.