Telangana Urea Scarcity:  తెలంగాణవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వరిపైరు ఏపుగా ఎదిగింది. పంట చేలు పచ్చని చీరకట్టినట్టుగా కళకళలాడుతున్నాయి. ఇప్పడు పంటకు యూరియా చల్లడంతో మంచి దిగుబడి రావడంతోపాటు రైతన్నకు కాస్త లాభాల పంట పండుతుంది. కానీ ఇదే సమయంలో తెలంగాణవ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా వెంటాడుతోంది. యూరియా విక్రయ కేంద్రాల వద్ద గంటల తరబడి భారీ క్యూలైన్లో నిలబడ్డా, రోజుల తరబడి కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితంలేదు. యూరియా ఇచ్చి మా పంటను బతికించండీ మహాప్రభో అంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ పాపం కేంద్రం వల్లనే అంటూ బిజేపిని విమర్శిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులకు యూరియా కొరత కష్టాలంటూ ఆరోపిస్తున్నాయి బీజేపీ బీఆర్‌ఎస్‌. ఇలా ఒకరిపై ఒకరు తప్పు మాది కాదంటే ,మాది కాాదంటూ యూరియా రాజకీయాలు చేస్తున్నారు.  

తెలంగాణలో యూరియా కొరత మరికొద్ది రోజులు కొనసాగితే ,ఏపుగా ఎదిగిన వరిపైరు సత్తువ లేక నిస్సారంగా మారిపోతుంది. దిగుబడి ఊహించని స్దాయిలో పడిపోతుంది. రైతుల జీవితాలు తలకిందులవుతాయి. ఈ ప్రభావం కేవలం రైతులపై మాత్రమే కాదు, దిగుబడి భారీగా తగ్గితే బియ్యం ధరలు అమాంతం పెరగడంతోపాటు ధాన్యం కొరత పెరిగి తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంటుంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా వరి పంటకు ప్రాణవాయువైన యూనియా కోసం రైతులు భారీగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. చెప్పులు, పాస్ బుక్‌లు క్యూలైన్లలో పెట్టి గంటల తరబడి యూరియా కోసం విక్రయ కేంద్రాలవద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ సీజన్‌లో 70వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించింది, కానీ ఇందులో 44,500 టన్నులు మాత్రమే రైతులకు ఇప్పటి వరకూ సరఫరా చేశారు. మిగతా 25,500 మెట్రిక్ టన్నులా యూరియా సరఫరా కాకపోవడంతో క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడింది. యూరియా రాగానే సహకార సంఘాల వద్ద, రైతు సేవా కేంద్రాల వద్ద యూరియాను వెంట వెంటనే రైతులు కొనుగోలు చేస్తుండం, క్షణాల్లో వచ్చిన స్టాక్ వచ్చినట్లు ఖాళీ అవ్వడంతో ఎక్కువ మంది రైతులకు యూరియా అందడంలేదు. 

తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఒక ఎకరాకు రెండు బస్తాలు ఇస్తుంటే ,మరికొన్ని చోట్ల ఒక బస్తా ఇస్తున్నారు. ఎక్కువ శాతం రైతులు యూరియా అందక కొనుగోలు కేంద్రాల వద్ద కాళ్ల వాచేలా నిలబడక తప్పడంలేదు. ప్రైవేటు వ్యాపారులు సైతం బ్లాక్‌లో కొని భారీగా స్టాక్ నిలబెట్టుకోవడం, యూరియాకు విపరీతంగా డిమాండ్ పెంచడంపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలో యూరియా కొరత తీవ్రత ఓ రేంజ్‌లో ఉంది. మేడ్చల్ జిల్లాలకు 8వేల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో 7వేల మెట్రిక్ టన్నుల యూరియా వెంటాడుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలో 8,300 మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి ఉంది. సంగారెడ్డి 6400 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడింది. కొరత తారాస్థాయిలో ఉన్న సమయంలో కూడా వచ్చిన ఎరువులు వచ్చినట్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయంటూ రైతులు మండిపడుతున్నారు. దళారులు యూరియా డిమాండ్ విపరీతంగా పెంచేయడంతో పుస్తెలు తాకట్టుపెట్టి మరీ అధిక ధరలకు యూరియా కొనసాల్సిన దుస్దితి రైతులను వెంటాడుతోంది. 

కేంద్రం నుంచి తెలంగాణకు ఈ ఏడాది రావాల్సిన ఎరువుల కోటాలో ఇంకా 3.12లక్షల మెట్రిక్ టన్నుల రావాల్సి ఉంది ,అందుకే రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందనేది అధికార పార్టీ వాదన. తాజాగా కాంగ్రెస్ ఎంపీల నిరసనలతో 50వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడున్న డిమాండ్‌కు 50వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోదు. ఇదిలా ఉంటే అధికార,ప్రతిపక్షాలు ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. యూరియా కొరత సమస్యను రాజకీయ విమర్శలకు ఆయుధంగా మార్చుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం కావాలనే తొక్కిపెడుతోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని యూరియా కొరత సృష్టించి రాద్దాంతం చేస్తోందని బిజేపి నేతలంటున్నారు. రాష్ట్రంలో యూరియా కష్టాలకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని బిఆర్‌ఎస్ అంటోంది. మాకు ఈ 5నెలల్లో ఇవ్వాల్సిన యూరియా కేంద్రం ఇవ్వలేదు,  అది మేము తయారు చేసేది కాదు, కేంద్రం సరఫరా చేసినప్పుడే రైతులకు ఇవ్వాలి. ఇదంతా కేంద్రం చేతిలో పని. కొరత ఉంటే చైనా, రష్యా నుంచి దిగుమతి చేసుకోకుండా, ఇక్కడ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి చేయలేక కేంద్రం చేతులెత్తేయడం వల్లనే రైతులు నష్టపోతున్నారని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తోంది.

చైనా ,ఉక్రేన్ నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం కానీ దిగుమతుల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సబ్సిడీని భరించి రైతులకు యూరియాను అందిస్తున్నది బిజెపి ప్రభుత్వం మాత్రమే అంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అంతర్జాతీయంగా యూరియా దిగుమతిలో తీవ్ర సమస్యలున్నా సబ్సిడీ భరించి మరీ సరఫరా చేస్తున్నామన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే చూడాలంటోంది బిజెపి. రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాక రైతులు యూరియా కోసం నరకం చూస్తున్నారని బిఆర్‌ఎస్ అంటోంది. పనిలో పనిగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు, యూరియాకు లింక్ పెట్టింది బీఆర్‌ఎస్. తెలంగాణలో యూరియా కొరత ఎవరు తీరిస్తే, 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎవరు సరఫరా చేస్తే, ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్దికే మా మద్దతని ప్రకటించింది. ఇలా యూరియా కొరత రైతులకు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తుంటే,  రాజకీయ పార్టీలకు మాత్రం పదునైన విమర్శనాస్త్రంగా మారింది.