Marwadi Go Back Protest in Hyderabad | తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి గో బ్యాక్ మార్వాడీ అనే నినాదం వినిపిస్తోంది. ఇటీవల బంద్‌కు సైతం పిలుపునివ్వడం తెలిసిందే. మార్వాడీలపై కొనసాగుతున్న వివాదంపై మార్వాడీ సంఘ అధ్యక్షుడు జిగ్నేష్ దోషి పలు విషయాలు ఏబీపీ దేశంతో పంచుకున్నారు.
ఏబీపీ దేశం.. మార్వాడీలపై తెలంగాణ వ్యాప్తంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. గో బ్యాక్ మార్వాడీ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఏంటని భావిస్తున్నారు ?
జిగ్నేష్ దోషి, మార్వాడీ సంఘ అధ్యక్షుడు..
తెలంగాణ, ఆంధ్రాలో ప్రతీ చోటా గుజరాతీలు, మార్వాడీలు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మా వ్యాపారాలు విస్తరించి ఉన్నాయి. మేము ఎటువంటి నకిలీ దందా చేయడంలేదు. మేము పుట్టింది, పెరిగింది తెలంగాణలోనే. గో బ్యాక్ అంటే మేము ఎక్కడికి పోవాలి. తెలంగాణ, ఆంధ్రా అనేవి వేరే దేశాలా.. మాకు గో బ్యాక్ చెప్పడానికి తెలంగాణ శ్యామ్ ఎవరు. అతడు తెలంగాణ శ్యామ్ కాదు,తమిళనాడు శ్యామ్ . తమిళనాడు పార్టీ నుండి పోటీన చేసిన వ్యక్తి మా గురించి విమర్శించే హక్కులేదు. తెలంగాణ వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఇన్నాళ్లు అంతా కలసిమెలసి ఉన్నాం. ఇప్పుడు గుజరాతీ గోబ్యాక్ , మార్వాడీ గోబ్యాక్ అనడం సరికాదు. అనాల్సింది చైనా గో బ్యాక్, విదేశీ సంస్కృతి గో బ్యాక్ అనాలి. మమ్మల్ని కాదు.
ఏబీపీ దేశం.. తెలంగాణ ఏర్పాటుకు ముందు నగరానికే పరిమితమైన మార్వాడీలు ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లోకి సైతం వెళ్లిపోయారు అనేది ప్రధాన విమర్శ. నకిలీ వస్తువులు,తక్కువ ధరలకే అమ్ముతూ, కుల వృత్తులను ,స్దానిక వ్యాపారులను మీరు దెబ్బకొడుతున్నారనే విమర్శలకు మీ సమాధానం..?
జిగ్నేష్ దోషి, మార్వాడీ సంఘ అధ్యక్షుడు..
ఏ వస్తువులైనా వివిధ రకాలు కంపెనీలు, నణ్యతలు, రకరకాల ధరలు ఉంటం సహజం.అది ఎక్కడైనా ఉంటుంది. కేవలం మార్వాడీ షాపుల్లోనే కాదు. బ్రాండెండ్ 4వేల రూపాయలు అయితే సెమీ బ్రాండెడ్ 1500 రూకే దొరుకుతుంది. అది నకిలీ ఎలా అవుతుంది. ఎవరికి ఏది కావాలో ,వాళ్లు అదే తీసుకుంటారు.మేము మోసాలు చేస్తే , నకిలీ అమ్ముతుంటే కష్టమర్లు ఏళ్ల తరబడి మా షాపుల్లో ఎందుకు కొంటున్నారు. మేము ఎన్నిరోజులు మోసాలు చేస్తాము. మాతాత, ముత్తాతల నుండి వ్యాపారం చేస్తున్నాం. నకిలీ వస్తువులు అమ్మితే , అలా ఎన్నిరోజులు వ్యాపారాలు చేయగలగుతాం. బిల్ ఇవ్వడం లేదంటే అడిగే బాధ్యత కష్టమర్ దే. జీఎస్టీ కట్టి బిల్లు ఇవ్వకపోతే అది వినియోగదారుడే అడిగి తీసుకోవాలి. తెలంగాణలో వివిధ కులవృత్తులు కలసి మాలా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకోవచ్చు. మేమెప్పుడూ వారిని అడ్డుకోలేదు.
మేము వడ్డీకి గుజరాత్ నుండి డబ్బులు అప్పులు తెచ్చి, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం. గ్రామాలలో మేము మోసాలు చేస్తే ఎందుకు ఊరుకుంటారు. మేము నకిలీ వస్తువులు అమ్ముతుంటే ఓ సంఘం ఏర్పాటు చేసి మాపై చర్యలు తీసుకోండి. దేశంలో ఓ ప్రాంతం వాళ్లు ఇన్ని షాపులే ఉండాలి, ఇంత వ్యాపారమే చేయాలని రాజ్యాంగంలో ఉందా. మేము ఇక్కడే ఉంటాం. మేము బ్రతికేది చచ్చేది తెలంగాణలోనే. తప్పు చేస్తే చట్టప్రకారం మాపై చర్యలు తీసుకోండి. వివిధ పార్టీల ముఖ్య నాయకులు సైతం మాకు మద్దతుగా మాట్లడుతున్నారు. మేము డబ్బుపెట్టి చట్టాన్ని కొంటున్నామని కొందరు ఆరోపిస్తున్నారు.అవన్నీ అవాస్తవాలు. మేము భారీ మొత్తంలో ఒకేసారి సరుకు తేవడంతో మావద్ద వినియోగదారులకు తక్కువ ధరకే అమ్మగలుగుతున్నాం. స్దానిక వ్యాపారులు కూడా అలా తెచ్చి, వ్యాపారాలు అభివృద్ది చేసుకోవచ్చు.
ఏబీపీ దేశం.. తెలంగాణవాళ్లు మద్యం త్రాగుతారు, వారికి వ్యాపారం చేయడం చేతకాదు అంటూ రెచ్చగొట్టే విమర్శులు మేరెందు చేశారు. గో బ్యాక్ మార్వాడీ నినాదంతో మీలో మార్పు రాబోతుందా, స్దానికులకు మీ వ్యాపారాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారా..?
జిగ్నేష్ దోషి, మార్వాడీ సంఘ అధ్యక్షుడు..
మా సంస్కృితిలో చిన్నప్పటి నుండి మద్యం త్రాగడం అలవాటు లేదు. నాన్ వెజ్ మేము తినము. తెలంగాణ సంస్కృతిలో మద్యం త్రాగడం ఎక్కవ మందిలో అలవాటు ఉంది. తెలంగాణలో మా స్నేహితులు సైతం దావాత్ లో తరచూ పాల్గొంటారు . అదే విషయాన్ని నేను చెప్పాను. ఎవరినీ రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. గో బ్యాక్ కంటే పెద్ద పెద్ద తెలంగాణ ఉద్యమాలనే మేము చూశాము. మేము మిమ్మల్ని రెచ్చగొట్టడంలేదు. స్దానికులకు 80శాతం అవకాశాలు కల్పించాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మా పరిధిలో ఆ నిర్ణయాలు ఉండవు. రాజ్యాంగం ప్రక్కకు పెట్టి వ్యవహరించలేము.
మార్వాడీలు తక్కువ మంది ఉన్నామని, ధర్నాలు,నిరసనలు చేయడంలేదు. అలా అని మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము. ఒక్కరోజులో పరిష్కారం చూపించే సమస్యలైతే మేమూ మీతో కలసి వస్తాం. తెలంగాణలో స్దానికులైన కులవృత్తుల సంఘాలు, వ్యాపారులతో మార్వీడీలకు సమావేశం పట్టండి. కలసి కూర్చిని మాట్లడుకుందాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా మా వల్ల ఎంతవరకూ అవుతుందొో మేము ,మా తప్పులుంటే సరిదిద్దుకుంటాం.