హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania university) అంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యామ్నాయ పదం. ఓయూ, తెలంగాణ పదాలు అవిభక్త కవలలు లాంటివని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
వందేమాతరం పాడి జాతీయోద్యమానికి స్ఫూర్తి..
1917లో నిజాం పాలనలో ప్రారంభమైన ఉస్మానియా యూనివర్సిటీ.. 1935 సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడటం కాదు. వందే మాతరం పాడి వినిపించిన పీవీ నరసింహారావు ఈ గడ్డమీద నుంచి ధిక్కార స్వరం వినిపించారు. తండాలు, గూడెలు, గ్రామాల్లోని ఎర్రజెండా మోసి ఉద్యమబాట పట్టిన వారికి ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలిచింది. జాతీయ స్థాయిలో హోం మంత్రిగా చేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలుకుని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా దేశ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసిన పీవీ ఓయూ పూర్వ విద్యార్థులే. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న జైపాల్ రెడ్డి సైతం ఇక్కడ చదువుకున్న వారే.
జార్జి రెడ్డి, గద్దర్ అన్నలను అందించిన విద్యాలయం ఉస్మానియా వర్సిటీ. తెలంగాణలో క్రీయాశీలక భాగస్వామ్యం తీసుకుని ఎంతో మంది విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, లాయర్లు, ఇతర రంగాల్లో ఉన్నవారు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉస్మానియాలో చదువుకునేది గవర్నమెంట్ జాబ్ కోసం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిబింబించే అడ్డా ఓయూ. ఇక మావల్ల కాదని కాడి కింద పడేస్తే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ జెండా ఎత్తుకున్నాక పరిస్థితి మారిపోయింది. ఓయూ జేఏసీ కన్వీనర్ గా ప్రొఫెసర్ కోదండరాం అనాడు వ్యవహరించారు. రాజకీయ నాయకులు రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తుంటే ప్రజలు వారిని అంతగా విశ్వసించలేదు.
శ్రీకాంతాచారి బలిదానంతో ఉద్యమానికి దారి..
మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడై మనకందరికి మార్గం చూపించాడు. శ్రీకాంతాచారి ప్రాణార్పణతో ఆ కుటుంబానికి ఒరిగిందేమీ లేదు. కానీ మనలో చలనం తీసుకొచ్చాడు. అతడు బతికుంటే గొప్ప స్థాయిలో ఉండి తన కుటుంబానికి ఎంతో చేసేవాడు. కానీ తన ప్రాణాలు అర్పించి రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పాడు. యాదయ్య ఉస్మానియా వర్సిటీ గేటు వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని జై తెలంగాణ అని నినదించాడు.
దేశానికి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు, లాయర్లు, ఇంజినీర్లను అందించించి ఉస్మానియా యూనివర్సిటీ. 1989-91 ఓయూ విద్యార్థి అయిన సీవీ ఆనంద్ ఐపీఎస్ సాధించిన యంగెస్ట్ పర్సన్. నేడు ఆయన డీజీపీ క్యాడర్‌లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచే ఓయూ కళావిహీనంగా తయారైంది. గత పాలనలో ఓయూలో వీసీలు, ప్రొఫెసర్ల నియామకం జరగక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓయూను నిర్వీర్యం చేసే కుట్ర జరిగింది. మళ్లీ ఓయూకు పూర్వ వైభవం తీసుకొస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, కార్పొరేషన్ చైర్మన్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.