Osmania University In Hyderabad |హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు రానున్న తరుణంలో ఆదివారం నుంచే క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగుల నిరసనలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం రేవంత్ భద్రతా చర్యల్లో భాగంగా ఓయూ క్యాంపస్ మొత్తం ఇనుప కంచెల నడుమ ముట్టడి చేసినట్టుగా కనిపిస్తోంది. అడుగడుగునా కంచెలు బిగించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కంచెలు లేకుండా రావాలని ప్రతిపక్షాల సవాల్

సీఎం పర్యటనను అడ్డుకునేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయత్నించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఏర్పాట్లపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. “ప్రజా పాలన అంటూ ఇనుప కంచెల మధ్య తిరుగుతున్న రేవంత్ రెడ్డి దేనికి సంకేతం?” అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓయూలో సీఎం పర్యటన చుట్టూ రాజకీయ వేడి పెరిగింది. భద్రతా చర్యలు ఎక్కడ చూసినా కంచెల మోతగా మారడంతో, రేవంత్ పర్యటనకు ముందే యూనివర్సిటీ రాజకీయ చర్చలకు అడ్డాగా నిలిచింది. ఎలాంటి కంచెలు లేకుండా ఓయూకు రావాలని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు.

2 కొత్త హాస్టళ్లు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీంలు ఇటీవల ఆహ్వానించారు. సోమవారం నాడు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మితమైన రెండు కొత్త హాస్టళ్లను సీఎం ప్రారంభించనున్నారు. 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే వీటి ప్రారంభంతో ఓయూలో వసతి సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి.

అదేవిధంగా, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ప్రస్తుతం ఓయూలో 25 హాస్టళ్లలో సుమారు 7,223 మంది విద్యార్థులు నివసిస్తున్నారు. కొత్త హాస్టళ్లతో విద్యార్థులకు అదనపు వసతులు లభించనున్నాయి. దీనితో పాటు దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ నిర్మాణానికి కూడా సీఎం భూమిపూజ చేయనున్నారు. విద్యార్థుల కోసం అత్యాధునిక సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్టుల ఉద్దేశ్యంగా అధికారులు పేర్కొన్నారు.

 20 ఏళ్ల తరువాత సీఎం హోదాలో ఓయూకు తొలి నేత

ఇక 20 ఏళ్ల తర్వాత ఓయూలో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించి, ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కానున్నారు. ఓయూలోని టాగూర్ ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో “తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు - ప్రభుత్వ ప్రణాళిక” అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తదితరులు పాల్గొననున్నారు. అదనంగా, “సీఎం రీసెర్చ్ ఫెలోషిప్”, విదేశీ విద్యార్థుల పర్యటనలకు ఆర్థిక సహాయ పథకాలను కూడా ప్రారంభించనున్నట్లు వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలిపారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక ఓయూలో నియామకాలు జరగలేదని విమర్శలు ఉన్నాయి. మొత్తం 1400 టీచింగ్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 100 వరకు ఖాళీగా ఉండగా.. నాన్‌టీచింగ్‌ విషయానికి వస్తే దాదాపు 2300 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు వర్సిటీ భూమి కబ్జా అవుతుందని, సరిహద్దులు నిర్ణయించి ఓయూ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.