MP Arvind: జగిత్యాలలో జరిగిన మహిళ వివాదం, ఆ తర్వాత ఎస్సై సస్పెన్షన్ వ్యవహారంపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం (మే 12) మీడియాతో మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ.. భార్య ఆత్మ గౌరవం కాపాడుకోలేని పోలీసులకు రివాల్వర్, ఖాకీ డ్రెస్ ఎందుకు అని ప్రశ్నించారు. బస్సులో ఉన్న యువతిని ఎస్సై భార్య ఏమీ అనలేదని.. బుర్కా వేసుకున్న మహిళ ఫిర్యాదు చేస్తే.. ఆగ మేఘాల మీద స్పందిస్తారా అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యల మీద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టి పెట్టాలని అర్వింద్ సూచించారు. ధాన్యం పండించిన రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి తలెత్తిందని విమర్శించారు. ప్రభుత్వం సక్రమంగా పని చేస్తే ఒక్క ధాన్యం గింజ కూడా వృథాగా పోదని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుండి బయటకు రావాలని అన్నారు. ట్విట్టర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించడం మానుకోవాలని మంత్రి కేటీఆర్ కు నిజామాబాద్ ఎంపీ సూచించారు. ఎకరా పంట నష్టానికి రూ. 10 వేలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
జగిత్యాలలో ఏం జరిగిందంటే?
ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ జరగగా.. ఎస్సై ఓ యువతిపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఆపై ఎస్సై భార్య సైతం బాధితురాలి తల్లిపై దాడికి దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బస్సులో సీటు కోసం తమపై ఎస్ఐ, ఆయన భార్య దాడి చేశారని, బస్సు ఆపి బెదిరించారని బాధిత యువతి, ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేయాలని రోడ్డుపై నిరసన తెలపడంతో జగిత్యాలలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి వీరిని అడ్డుకున్నారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయకుండా తోటి పోలీసును వెనకేసుకొస్తున్నారని యువతి బంధువులు ఆరోపించారు.
బెజ్జంకి నుండి యువతి (22 సం.లు), MBA విద్యార్థిని, ఆమె తల్లి ఆర్టీసీ బస్సులో జగిత్యాలకి వస్తున్నారు. కరీనంనగర్ లో ఒక మహిళ బస్సులోకి ఎక్కింది. తను కూడా జగిత్యాలకు వస్తుంది. యువతి, తన తల్లి ఇద్దరు కూర్చున్న సీటు వద్ద వెళ్లి ఖాళీగా ఉన్న మూడవ సీటులో కూర్చుంది. పదేపదే మరికొంత జరగమని అనడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఒకరికొకరు మాటలు అనుకున్నారు. ఆ తర్వాత ఆ మహిళ వెనకి సీటులోకి వెళ్లి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వాళ్ల సీటు దగ్గరికి వచ్చి కూర్చుని, నా భర్త ఏస్సై. నేను నా భర్తకు ఫోన్ చేశాను. అతను వచ్చి మీ సంగతి చూస్తాడు అని బెదిరించింది. వారు జగిత్యాల బస్టాండులో దిగినంక మాట్లాడుకుందాం అని అన్నారు.
సినీ ఫక్కీలో ఎస్సై అనిల్ ఏంట్రీ
బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఎస్సై అనిల్, డ్యూటీ డ్రెస్ లో ఒక కానిస్టేబుల్ బస్సు ఆపాడు. ఆ ముస్లిం యువతిని, తన తల్లిని దుర్భాషలాడాడు. ఆ యువతి ఫోన్లో వీడియో తీస్తుండటంతో కోపోద్రిక్తుడై కొట్టినట్లు తెలుస్తోంది. అక్కడితో ఆ వీడియా ఆగిపోయింది. తర్వాత బస్సు నుండి కిందకు దించి ఎస్సై, తన భార్య ఇద్దరూ కలిసి కొట్టినట్లు బాధితులు ఆరోపించారు. ఆ అమ్మాయి నుండి ఫోన్, బస్సు టికెట్లు, పర్సు లాక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఎస్సై అనిల్. ఈ ఘటన సంచలనంగా మారడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపించి ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేశారు.