MP Arvnid: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్.. గెలిచిన తర్వాత దానిని తుంగలో తొక్కారన్నారు. కరోనా సమయంలో వేగంగా వ్యాక్సిన్ కనుగొనడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి అని ఎంపీ అర్వింద్ తెలిపారు. అమెరికా కంటే అతివేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలోనే జరిగిందని వివరించారు. ఈ క్రమంలోనే 3 కోట్ల 50 లక్షల ఇల్లు పేదలకు కేంద్ర ప్రభుత్వం కట్టించి ఇచ్చిందని తెలిపారు.


రాష్ట్రంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసిన కేసీఆర్.. గెలిచిన తర్వాత ఆ ఊసు ఎత్తడమే మానేశారంటూ ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ మాయ అని... 2021లో 10 వేల కోట్లు కేటాయించారని అన్నారు. ఇప్పటి వరకు దాని ఆడిటింగ్ ఊసే లేదంటూ కామెంట్లు చేశారు. రూ. 10875 కోట్లు డబుల్ బెడ్ రూమ్ కి కేటాయించి.. ఆ తర్వాత దాన్ని 4 వేల కోట్లకు కుదించారని చెప్పారు. ఆ డబ్బుల లెక్కలు ఇంత వరకు లేవంటూ ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని విమర్శించారు. ప్రపంచంలో అతిపెద్ద పథకం ఆయుష్మాన్ భారత్ అని దాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. 


ఈ కార్యక్రమంలో భాగంగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సాయంతో తొమ్మిదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి, అంతకు ముందు 60 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని అర్వింద్ వివరించారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల 72 లక్షల మరుగుదొడ్లను మోదీ సర్కార్ నిర్మించిందని తెలిపారు. కానీ రాష్ట్రంలో మరుగుదొడ్లను నిర్మించకుండానే.. పూర్తి చేసినట్లు చూపించి ఎమ్మెల్యేలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని అర్వింద్ ఆరోపించారు. మరోవైపు కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో సీఎం కేసీఆర్ దోచుకున్నారని అర్వింద్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వల్ల ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. దీని కింద 10 కోట్ల 74 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. ప్రతీ ఎకరానికి 35 వేల రూపాయలను వివిధ రూపాల్లో ప్రధాని మోదీ ఇస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణాల పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిందని గుర్తు చేశారు.


దేశంలో 2014 వరకు 74 ఎయిర్ పోర్టులు మాత్రమే ఉంటే.. కేంద్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 9 సంవత్సరాలలోనే మరో 74  నిర్మించినట్లు అర్వింద్ వివరించారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే నాలుగేళ్లలో 900 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు వస్తాయని అన్నారు. మరోవైపు వేల కోట్ల బడ్జెట్ తో రైల్వే స్టేషన్ల సుందరీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. 370 ఆర్టికల్ రద్దు వల్ల కాశ్మీర్ లో అల్లర్లు, టెర్రరిజం తగ్గి, అభివృద్ధి పెరిగిందని.. మూడోసారి కూడా బీజేపీని గెలిపిస్తే... భారత్ ఇంగా అభివృద్ధి చెందుతుందని ఎంబీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.