MLC Kavitha vs MP Arvind Dharmapuri:  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై చేసిన కామెంట్స్ నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచాయి. ఎంపీ అరవింద్ పై కవిత హాట్ కామెంట్స్ బీజేపీలో చర్చనీయాంశమయ్యాయి. అరవింద్ ఎక్కడ పోటీలో ఉన్నా ఓడిస్తానని ఎమ్మెల్సీ కవిత చేసిన సవాల్ టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. కవిత విసిరిన సవాల్ కు సిద్ధమని అరవింద్ కూడా పోటీకి సై అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కీలక నేతల మధ్య కామెంట్ల వార్ తో నిజామాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  
ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా ఇప్పటివరకు ఈ స్థాయిలో స్పందించలేదు. కవిత గతంలో ఏనాడు వ్యక్తుల పరంగా హాట్ కామెంట్స్ చేయలేదు. అర్వింద్ నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడకపోతే చెప్పుతో కొడతానని అరవింద్ పై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే వెంటపడి కొడతామన్నారు. పరిధి దాటితే మెత్తగా తంతామన్నారు. తమాషాలు చేస్తే ఊరుకోబోమన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేసిన ధర్మపురి అర్వింద్ పై రైతులు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే కవిత అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. అరవింద్ మాట తీరుపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న  కవిత చేసిన కామెంట్స్ అందరిని షాక్ చేశాయి. 


ఇటు ఎమ్మెల్సీ కవిత, అటు ఎంపీ అరవింద్ కామెంట్స్ పై టీఆరెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేసుకున్నాయి. నిజామాబాద్ ధర్నా చౌక్ శుక్రవారం నాడు నినాదాలతో దద్దరిల్లింది. ధర్నా చౌక్ లో మొదట బీజేపీ నాయకులు అరవింద్ పై చేసిన వ్యాఖ్యలకు నీరసనగా ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. 


అనంతరం అదే ధర్నా చౌక్ లో టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జాగృతి నాయకులు అవంతి రావు ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అరవింద్ తీరు మారకుంటే నిజామాబాద్ జిల్లాలో తిరగనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటామంటూ టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ ఎంపీని హెచ్చరించాయి. ఇలా ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా దిష్టిబొమ్మలు దగ్ధం చేయటంతో ఒక్కసారిగా నిజామాబాద్ లో పొలిటికల్ హీట్ పెరిగింది.


హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లొకి చొరబడి బీభత్సం సృష్టించారని.. మా అమ్మను బెదిరించారన్నారు. తన తల్లిని బెదిరించే హక్కు మీకు ఎవరిచ్చారని ఎంపీ ప్రశ్నించారు.  తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత ప్రకటించడంపై అర్వింద్ మండిపడ్డారు. తనపై ఏమని కేసు వేస్తారని..  టీఆర్ఎస్ మేనిఫెస్టో మొత్తం చీటింగేనని..  కవిత తన తండ్రిపైనే కేసు పెట్టాలన్నారు. పసుపు రైతులను తాను మోసం చేయలేదన్నారు. నిజామాబాద్ ఎన్నికల్లో 178 మంది నామినేషన్లు వేస్తే అందులో 78 మంది బీజేపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. కవితకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అన్ని పార్టీలలోనూ తనకు మిత్రులు ఉంటారన్నారు.