MLC Kavitha: బదుకు దెరువు కోసం ఖతార్ వెళ్లిన ఇద్దరు మహిళలకు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. దేశం కాని దేశంలో నరకయాతన అనుభవించి జైల్లో చిక్కుకున్న బాధితులను క్షేమంగా స్వదేశానికి రప్పించారు. నిజామాబాద్ నగరం డ్రైవర్స్ కాలానీకి చెందిన ఆసియా బేగం, షేక్ నసీమాలు గత పది నెలల క్రితం బతుకు దెరువు కోసం ఖతర్ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత పనిలో చేర్చుకున్న వారు జీతం సరిగ్గా ఇవ్వకపోగా వేధింపులకు గురి చేశారు. ఇద్దరు మహిళతో పని చేయించుకుంటూ, అటు జీతం డబ్బులు ఇవ్వక, తిండి కూడా సరిగ్గా పెట్టకుండా నానా ఇబ్బందులు పెట్టారు. కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా నరకం చూపించారని బాధితులు చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై వేడి నీళ్లు పోసి నరకాయాతనకు గురిచేశారని తెలిపారు. బాధితులు అక్కడి పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. 


అయితే వేధింపులు తట్టుకోలేని వాళ్లు తప్పించుకొని బయటకు రావడంతో.. పోలీసులు రన్ అవే కేసు కింద వారిని జైల్లో పెట్టారు. బాధితులు ఈ విషయాన్ని నిజామాబాద్ నగరంలో ఉన్న వారి బంధువుల ద్వారా జాగృతి నాయకులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత పెద్ద మనసుతో వారికి అండగా నిలిచారు. అధికారులతో మాట్లాడి కేవలం 10 రోజుల్లో బాధితులను క్షేమంగా ఇంటికి చేర్చారు. ఇక్కడికి వచ్చేందుకు ఖర్చు మొత్తం కవితే భరించారని బాధితులు తెలిపారు. తమను క్షేమంగా ఇంటికి చేర్పించిన ఎమ్మెల్సీ కవితకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు వివరించారు. బాధితులను ఈరోజు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీనాచారి అవంతి సుధాకర్ తదితరు వెళ్లి మాట్లాడారు.


గల్ఫ్ ఏజెంట్ల మోసాలతో.. నరకం చూస్తున్న వలసజీవులు!


గల్ప్ ఏజెంట్ల మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతను టార్గెట్ చేసుకుని మోసాలకు తెగబడుతున్నారు. గల్ఫ్ దేశాలు, ఇతర విదేశాల్లో అధిక జీతాలు ఇప్పిస్తామని ఆశచూపి మోసాలకు పాల్పడుతున్నారు. భోజనంతో పాటు ఉచిత వసతి సదుపాయం ఉంటుందని నమ్మిస్తున్నారు. కాగితాలపై లెక్కలు బేరీజు వేసుకుంటున్న యువత వారు చెప్పిన వెంటనే పాస్ పోర్టు ఇతర గుర్తింపు కార్డులు అప్పగిస్తున్నారు. తీరా వీసా వచ్చేసిందని నమ్మించి రూ. 90 వేల నుంచి లక్ష దాకా వసూలు చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, మెడికల్ పరీక్షల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. చివరకు గల్ఫ్ దేశాలకు పంపించకుండానే నిలువునా మోసగిస్తున్నారు. మోసపోయిన యువత పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోవటం లేదని, తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఉపాధి అంటే గల్ఫ్.. కష్టాలకు కేరాఫ్ అడ్రస్


నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు వందమందికి పైగా ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం అప్పు సొప్పు చేసి ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారు. గల్ఫ్ లో మంచి ఉద్యోగాలిప్పిస్తామని ఇక్కడ ఆశ చూపి తీరా అక్కడికి వెళ్లే సరికి ఏజెంట్లు చెప్పిన ఉద్యోగం రావటం లేదు. అక్కడికెళ్లాక బాధితులు ఆపసోపాలు పడుతున్నారు. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు తీర్చాలన్న భయంతో తక్కువ జీతానికైనా ఏదో ఒక పనిలో చేరిపోయి అష్టకష్టాలు పడుతున్నారు. 
నందిపేట్ మండలం దత్తాపూర్ గ్రామానికి చెందిన గణేష్ అనే యువకుడికి ఓ ఏజెంట్ దుబాయ్ లో నెలకు లక్ష రూపాయల జీతం ఇప్పిస్తామని చెప్పి అతని నుంచి రెండున్నర లక్షల రూపాయలు వసూలు చేశారు. తీరా ఆ యువకుడు అక్కడికి వెళ్లాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగం దేవుడెరుగు.. కనీసం అక్కడ తినటానికి తిండి లేని పరిస్థితి ఎదుర్కొన్నానని ఏబీపీ దేశానికి  అతని గోడు వెళ్లబోసుకున్నాడు. అక్కడ హోటల్ లో పాచి పని చేసి తిరిగి ఇండియాకు రావటానికి డబ్బులు జమ చేసుకుని వచ్చాడు గణేష్. అతడి లాంటి వాళ్లు చాలా మంది ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారు.