Gadwal News : న్యూడ్ వీడియో కాల్స్ చిత్రీకరించి యువతులను వేధించిన ఘటన గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. యువతుల న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళల న్యూడ్ కాల్స్ కేసులో ఒకరిని అరెస్టు చేశారు పోలీసులు. మరొకరి కోసం గాలిస్తున్నారు. అయితే వంద మహిళల ట్రాప్ వాస్తవం కాదంటున్నారు పోలీసులు. ఇంతకు గద్వాలలో ఏం జరిగింది.
అసలేం జరిగింది?
గద్వాల పట్టణానికి చెందిన తిర్మల్ అలియాస్ మహేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా యువతులను ట్రాప్ చేస్తున్నాడు. మాయ మాటలు చెప్పి వారితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నాడు. ఇలా న్యూ డ్ గా మాట్లాడుతున్న వీడియోలను రికార్డు చేశాడు. మహేశ్వర్ రెడ్డి ఫోన్లో ఉన్న ఆ న్యూడ్ వీడియోలను అతనికి తెలియకుండా తీసుకున్నారు మరో ఇద్దరు యువకులు. ఆ తర్వాత మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి ఆ ఇద్దరు యువకులతో గొడవపడ్డాడు. దీంతో వారిలో ఓ యువకుడు ఆ న్యూడ్ వీడియోను తన స్టేటస్ లో పెట్టాడు. ఆ వెంటనే తొలగించినప్పటికీ అది వైరల్ అయింది. రెండు నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది. చివరకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
వంద మంది మహిళల ట్రాప్ అవాస్తవం
ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు నాయకుల ప్రమేయం ఉన్నట్లు చర్చ జరిగింది. మహిళలు తీవ్రంగా వేధించారని శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు గురయ్యారని సోషల్ మీడియా లో వైరల్ అయింది. దీంతో పోలీసులు మహేశ్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు నిఖిల్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల బృందం ఈ ఘటనపై వివారణ చేపట్టారు. గద్వాలలో హనీ ట్రాప్ జరిగిందని, చాలా సున్నితమైన విషయం కాబట్టి సుమోటోగా కేసు నమోదు చేయాలని మరోవైపు మహిళల ప్రైవసీ దెబ్బతినకుండా విచారణ జరిపి, ఎంతటి వారైన కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. మహిళలు ఎవరూ ఫిర్యదు చేయలేదని, సున్నితమైన విషయం కాబట్టి సుమోటోగా కేసు నమోదు చేసి తిర్మల్ అలియాస్ మహేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశామన్నారు. నిఖిల్ కోసం గాలిస్తున్నామని డీఎస్పీ రంగాస్వామి తెలిపారు. వంద మంది మహిళలను ట్రాప్ చేశారని, బ్లాక్ మెయిల్ చేశారనే వార్తల్లో వాస్తవం లేదని చెబుతున్నారు.
సోషల్ మీడియా పరిచయాలు
సోషల్ మీడియాలో కొత్త పరిచయాలు పెడదారులు పడుతున్నాయి. చాటింగ్ తో పరిచయం మొదలై వ్యక్తిగత సమాచారంతో పాటు ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే స్థాయికి వెళ్తోంది. నంబర్లు మార్చుకుని వీడియో కాల్స్ చేసుకుంటున్నారు. వాట్సాప్ చాట్స్, వీడియో కాల్స్‌తో దగ్గరవుతూ మాయ మాటలు చెప్పి న్యూడ్ కాల్స్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి కొత్త పరిచయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.