ENG vs SL T20: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ 2022 గ్రూప్‌ 1లో సెమీస్‌ చేరే జట్లేవో తెలిసిపోయింది. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ నాకౌట్‌కు దూసుకెళ్లాయి. సిడ్నీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఆంగ్లేయులు 4 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ప్రత్యర్థి నిర్దేశించిన 142 రన్స్‌ టార్గెట్‌ను 19.4 ఓవర్లలో ఆచితూచి ఛేదించారు. అలెక్స్‌ హేల్స్‌ (47; 30 బంతుల్లో 7x4, 1x6), బెన్‌ స్టోక్స్‌ (42; 36 బంతుల్లో 2x4, 0x6) సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు. అంతకు ముందు లంకలో పాథుమ్‌ నిసాంక (67; 45 బంతుల్లో 2x4, 5x6) టాప్‌ స్కోరర్‌!


నిలబడ్డ నింసాక


టాస్ గెలిచిన వెంటనే లంక బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు పాథుమ్‌ నిసాంక (67), కుశాల్‌ మెండిస్‌ (18) శుభారంభమే అందించారు. జట్టు స్కోరు 39 వద్ద కుశాల్‌ను వోక్స్‌ ఔట్‌ చేయడంతో లంక దూకుడు తగ్గింది. ధనంజయ (9), అసలంక (8) వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. 118 వద్ద నిసాంకను రషీద్‌ ఔట్‌ చేయడంతో రన్‌రేట్‌ తగ్గింది. చివర్లో భానుక రాజపక్స (22) బంతికో పరుగు చొప్పున చేయడంతో లంక 141/8తో నిలిచింది.


బెన్‌స్టోక్స్‌ అండ


ఛేదించాల్సిన లక్ష్యం మరీ ఎక్కువగా లేకపోవడంతో ఆంగ్లేయులు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (28), అలెక్స్‌ హేల్స్‌ (47) విధ్వంసకరంగా ఆడారు. తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరినీ 7 పరుగుల వ్యవధిలో హసరంగ పెవిలియన్‌ పంపించడంతో ఇంగ్లిష్‌ జట్టు జోరు తగ్గింది. లాహిరు కుమార, ధనంజయ సైతం బంతితో చెలరేగడంతో హ్యారీ బ్రూక్‌ (4), లియామ్‌ లివింగ్‌స్టన్‌ (4), మొయిన్‌ అలీ (1), సామ్‌ కరణ్ (6) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. అయితే ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఒంటరి పోరాటం చేశాడు. 116 స్ట్రైక్‌రేట్‌తోనే బ్యాటింగ్ చేశాడు. వికెట్‌ ఇవ్వకుండా లంకను ఓడించాడు.


ఆసీస్‌ ఇంటికి!


ఈ మ్యాచుతో గ్రూప్‌ 1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ సెమీస్‌కు చేరుకున్నాయి. లంక చేతిలో ఓడిపోయుంటే 5 పాయింట్లతో ఆంగ్లేయులు ఇంటికెళ్లేవారు. మ్యాచ్‌ గెలవడంతో 7 పాయింట్లు, పాజిటివ్‌ నెట్‌రన్‌రేట్‌తో ఆసీస్‌ను 7 పాయింట్లతోనే ఉన్న ఆసీస్‌ను వెనక్కి నెట్టేశారు. బహశా సెమీస్‌లో టీమ్‌ఇండియాతో తలపడే అవకాశం ఉంది.