Mohammad Nabi Leaves Captaincy: అఫ్ఘనిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ జట్టు కెప్టెన్ గా తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్ లో ఒక్క విజయం లేకుండా సూపర్- 12 నుంచి అఫ్ఘాన్ జట్టు నిష్క్రమించింది. ఈ క్రమంలో జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ నబీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ లో లేఖను పోస్టు చేశాడు. 


టీ20 ప్రపంచకప్ లో జట్టు ఫలితాలతో మీరు (అభిమానులు) ఎంత అసహనానికి గురయ్యారో మేమూ అంతే నిరాశకు గురయ్యాం. టోర్నీలో మన జట్టు ప్రయాణం అసంతృప్తిగా ముగిసింది. మిమ్మల్ని నిరాశపరిచాం. గత ఏడాది కాలంగా పెద్ద టోర్నమెంట్లకు అనుగుణంగా జట్టు సన్నద్ధత సాగలేదని కెప్టెన్ గా నేను అనుకుంటున్నాను. ప్రపంచకప్ నకు ముందు ఏర్పాటు చేసిన పర్యటనలపై జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ, నేను ఒకే దారిలో వెళ్లినట్లు అనిపించలేదు. జట్టులో సమతుల్యతను తేలేకపోయాం. అందుకే నేను వెంటనే కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నాను. ఒక ఆటగాడిగా జట్టుకు నా అవసరం ఉందని మేనేజ్ మెంట్ భావిస్తే నేను తప్పకుండా ఆడతాను. అఫ్ఘనిస్థాన్ జట్టును ప్రోత్సహించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు అంటూ నబీ పేర్కొన్నాడు. 


గతేడాది యూఏఈలో జరిగిన ప్రపంచకప్ నుంచి నబీ అఫ్ఘనిస్థాన్ కెప్టెన్ గా ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్ లో నబీ బ్యాట్స్ మెన్ గా, బౌలర్ గా విఫలమయ్యాడు. సూపర్- 12 దశలో ఆడిన 5 మ్యాచుల్లో అఫ్ఘాన్ జట్టు 3 మ్యాచుల్లో ఓడిపోయింది. మరో 2 మ్యాచులు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో ఒక్క విజయం కూడా లేకుండా ఆ జట్టు ఇంటిముఖం పట్టింది.