Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో డ్రగ్స్‌ వ్యతిరేక ఉద్యమాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. పోలీస్‌ యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ డ్రగ్స్ వారోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కలెక్టర్ చౌరస్తా, వినాయక్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా చేపట్టిన ర్యాలీని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, యువతతో కలిసి మంత్రి జూపల్లి ర్యాలీలో పాల్గొన్నారు. 

ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ... జీవితం చాలా విలువైందని, చెడు అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు. ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని చెప్పారు. ప్రతీ ఒక్కరు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా సమాజంలో మాదకద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 

డ్రగ్స్‌ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయని, డ్రగ్స్‌కు, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా జిల్లా ప్రజలు  పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు మంత్రి. విద్యార్థులు, యువత, పోలీస్‌ అధికారులు, సిబ్బంది డ్రగ్స్‌ వ్యతిరేక కార్యక్రమాలకు కలిసి రావాలని కోరారు. 

మారిన జీవన విధానం వల్ల మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రతీ రోజు ఒక గంట వ్యాయామం, నడక, యోగ, ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేలేలు పాయల శంకర్, వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షీ షా, ఎస్పీ అఖిల్ మహాజన్, తదితరులు పాల్గొన్నారు.