Adilabad Latest News: ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా ప్రతి లబ్ధిదారుడికి అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని తెలంగాణ ఆబ్కారీ -మధ్య నిషేధ, పర్యాటక శాఖల మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులందరికీ అందించాలని సూచించారు. ప్రభుత్వాలు చట్టాలు చేసినప్పటికీ వాటిని అమలు చేసే బాధ్యత అధికారులదేనని, చిత్తశుద్ధితో పనిచేసే లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
ధరణి పోర్టల్ మాదిరి రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం భూ భారతి నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతుందని తెలిపారు మంత్రి జూపల్లి. రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. భూ భారతి చట్టంపై ప్రజలందరికీ తెలిసే విధంగా వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం, జిల్లాలో పత్రిక ప్రకటనలతో ప్రచారం చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్లు చట్టం అమలు కొరకు ప్రత్యేక బృందాలను నియమించి ప్రతి బృందానికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్పందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామస్థాయిలో అధికారులు బాధ్యతగా విధులు నిర్వహిస్తూ నిర్ణీత సమయంలోగా పథకాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు జూపల్లి. ప్రజాపాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సకాలంలో అందే విధంగా అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలు పూర్తి స్థాయిలో సాధించాలని హితవుపలికారు. గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను వాట్సప్ ద్వారా అధికారులకు తెలియజేసి వారం రోజులకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రైతు భరోసా పథకం ద్వారా 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు అర్హత గల రైతుల ఖాతాలలో జమ చేసినట్టు తెలిపారు మంత్రి జూపల్లి. వానాకాలం పంట సాగుకు పెట్టుబడి సాయం అందించడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రుణమాఫీ పథకం ద్వారా 2 లక్షల రూపాయలలోపు 21 వేలకోట్ల రూపాయలు మాఫీ చేశామన్నారు. 16 నెలలలో నెలకు 6 వేల 500 కోట్లు బ్యాంకుల ద్వారా అందించామని తెలిపారు.
ప్రతి గ్రామాన్ని జిల్లా కేంద్రానికి అనుసంధానించేలా రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు జూపల్ల. ఆదిలాబాద్ నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ వరకు గల రహదారులను మరమ్మత్తులు చేసి వాహనదారుల ప్రయాణాన్ని సుగమం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు.
మంత్రి వివేక్ మాట్లాడుతూ...
రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో మంత్రిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. గృహజ్యోతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 900 కోట్లు లబ్ధిదారులకు అందిస్తున్నామని, పేద ప్రజలకు ఈ పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు.
విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు వివేక్. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు అందించడంతోపాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వివరించారు.
పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతు భరోసా పథకం అమలు చేయడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ విద్య సంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులకు సకల సదుపాయాల నడుమ నాణ్యమైన విద్యను అందించడాన్ని ప్రశంసించారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ కీలక ప్రకటన
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి పథకంలో జిల్లాలో అర్హత గల లబ్ధిదారులు 73 వేల 476 మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి పొందారని వివరించారు. అర్హత గల వారు ఎవరైనా ఉన్నట్లయితే దరఖాస్తులు పరిశీలిస్తున్నామని తెలిపారు. భూభారతి చట్టంలో భాగంగా జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 4 వేల దరఖాస్తులు వచ్చాయని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలనకు బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
సి.ఎం.ఆర్. సమస్యల వల్ల జిల్లాలోని 10 వేల టన్నుల ధాన్యాన్ని పెద్దపల్లికి పంపించినట్టు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని కొన్ని ఇందిరమ్మ ఇండ్లు కోర్ ఏరియాలో ఉండడంతో అటవీ శాఖ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో నకిలీ/ నిషేధిత విత్తనాలు, ఎరువుల విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు వెల్లడించారు.