Mancherial MLA Premsagar Rao: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంటెక్ వెల్ ను సందర్శించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావ్
హాజీపూర్: వచ్చే సంక్రాంతికి మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్దనున్న ఇంటెక్ వెల్ ను ప్రేమ్ సాగర్ రావు బుధవారం సందర్శించారు. హాజీపూర్ మండలంలోని మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ ను అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ప్రాజెక్ట్ ను పరిశీలించి అధికారులను నీరు ఎక్కడెక్కడికి తరలిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిషన్ భగీరథ నీటి శుద్దీకరణ పక్రియను పరిశీలించారు. ప్రాజెక్ట్ నీరు నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాలని, వారి అవసరాలు తీరిన తర్వాతనే మిగతా ప్రాంతాలకు తరలించాలాని ప్రేమ్ సాగర్ రావు అధికారులను ఆదేశించారు. 




సంక్రాంతికి తాగు నీరు అందేలా కృషి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ... వచ్చే సంక్రాంతికి మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు ప్రతి రోజు రెండు గంటల చొప్పున తాగునీరు అందిస్తామన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు, వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలగకుండా సాగు నీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. దండేపల్లి మండలంలోని రైతులకు సాగు నీరు కడెం ప్రాజెక్ట్ నుండి అందేలా కృషి చేస్తామన్నారు. 


తాను మాట ఇచ్చిన ప్రకారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుండి నియోజకవర్గ ప్రాంత ప్రజలకు త్రాగు నీరు, సాగు నీరు అందించిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులకు  తెలిపామన్నారు.తన పై ఎంతో బాధ్యత ఉంచి తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తన బాధ్యతగా ప్రజలకు నిరంతరం త్రాగు నీరు, సాగు నీరుతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ గ్రిడ్  ఈఈ మధుసూదన్ ,SYP ఈఈ స్వామి, గూడెం లిప్ట్ ఈఈ దశరథం, సంబంధిత అధికారులు ఉన్నారు.