Mancherial Latest News: మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. చెప్పులు క్యూలో పెట్టి రైతులు నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద పాదరక్షలను లైన్‌లో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. 

గురువారం యూరియా పంపిణీ చేస్తారనే సమాచారంతో మండలంలోని రైతులు వ్యవసాయ మారెట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో నిర్వాహకులు క్యూలో నిలబడాలని సూచించారు. వృద్ధులు, మహిళలు క్యూలో నిలబడలేక చెప్పులు క్యూలో పెట్టి మరీ పక్కకువెళ్లి కూర్చున్నారు. వారం రోజులుగా యూరియా కోసం సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రైతులకు అందించాల్సిన యూరియా బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ వారు ధనాపేక్షతో పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. మహారాష్ట్రకు యూరియా అక్రమంగా రవాణా జరుగుతోందని, దీంతో చెన్నూర్‌లో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

యూరియా అక్రమ రవాణా జరుగుతున్నా అడ్డుకట్ట వేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు దుయ్యబట్టారు. మండలంలో జరుగుతున్న యూరియా అక్రమాలను అరికట్టి రైతులకు అవసరమైన యూరియాను రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇది ఒక్క మంచిర్యాలకు సంబంధించిన సమస్యే కాదని రాష్ట్రవ్యాప్తంగా ఇలానే ఉందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వాని చేతకానితనం వల్లే ఇలాంటి సమస్య వస్తోందని మండిపడింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్‌రావు కరీంనగర్‌లో బారులు తీరిన రైతుల ఫొటోలను సోషల్ మీడిాయలో పోస్టు చేశారు.   

విత్తనాలు వేసిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందు పడిగాపులు పడుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓ పత్రికలో వచ్చిన వార్తను పోస్టు చేసి ప్రభుత్వపై విమర్శలు చేశారు. మార్పు అంటే ఇదేనా అంటూ నిలదీశారు. బీఆర్‌ఎస్ హాయంలో సక్రమంగా దొరికిన ఎరువులు ఇప్పుడు ఎందుకు దొరకడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.