Komram Bheem Asifabad Latest News: పోడు భూముల వివాదం గురించి ముఖ్యమంత్రికి వివరించేందుకు హైదరాబాద్ వస్తున్న కుమ్రమ్ భీమ్ ఆసిఫాబాద్‌లోని దిందా రైతుల అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల అరెస్టును బీఆర్‌ఎస్ ఖండించింది. ఆ పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. జోక్యంచేసుకున్న పోలీసులు ఆయన్ని కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో బీఆర్‌ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు.
శాంతియుతంగా చింతలమానేపల్లి మండలంలోని దిందా నుంచి పాదయాత్రగా వస్తున్న రైతులను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు బీఆర్‌ఎస్‌నేతలు. 40 మంది రైతులను రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రైతులను తరలిస్తున్న బస్‌ను ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు బీఆర్‌ఎశ్ పార్టీ శ్రేణులు అండగా నిలబడ్డారు. కాగజ్నగర్ కోసిని గ్రామం ప్రాణహిత భవన్ వద్ద బస్సును అడ్డుకున్నారు.
ఒక్కసారిగా ఆర్‌ఎస్‌ప్రవీణ్ కుమార్ అనుచరులతో వచ్చి బస్‌ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారని నేతలు ఆరోపిస్తున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు. అరెస్టులకు భయపడేది లేదని వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. అరెస్టుకు ముందు మాట్లాడిన ఆర్‌ఎస్ ప్రవీణకుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పోడు భూములకు పట్టాలిచ్చి,అటవీ అధికారుల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రిని కలవడానికి వస్తుంటే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. పోడు రైతులను అరెస్ట్ చేయడం పిరికిచర్య అని అభిప్రాయపడ్డారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి మూడు బస్సుల్లో రైతులను తిరిగి ఆసిఫాబాద్ జిల్లాకు తరలించడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు. "రైతులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేయడమేంటి. ముఖ్యమంత్రి బాధలు వినాల్సింది పోయి, న్యాయం చేయకుండా అరెస్టు చేయడం దారుణం. రైతు డిక్లరేషన్ పేరు చెప్పి రైతులకు బేడీలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. లగచర్లలో,గద్వాలలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం నేడు దిందా రైతులను అరెస్ట్ చేసింది." అని మండిపడ్డారు.
కేసిఆర్ పాలనలో రైతులు స్వర్ణయుగం చూసారని,రేవంత్ రెడ్డి వచ్చాక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ప్రవీణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో 550 మంది రైతులు మరణించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి అయితే రైతులను కలిసి మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపేవారన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ, రాజ్యాంగం పట్టుకొని జీవించే హక్కు ఆర్టికల్ 21 గురించి మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో రైతులు తమ బాధలు చెప్పుకుందామంటే అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఎలాంటి నిరసన,ధర్నాలు చేయలేదని శాంతియుతంగా సమస్యల కోసం పాదయాత్ర చేస్తే అరెస్ట్ చేయడం దారుణమన్నారు ప్రవీణ్. వారి ఓట్లతో గెలిచిన బిజెపి ఎమ్మెల్యే మాట్లాడడంలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి,కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఈ విషయాన్ని ఎందుకు చేరవేయడం లేదని,ఎందుకు న్యాయం చేయడంలేదని నిలదీశారు. వెంటనే ప్రభుత్వం రైతులను విడుదల చేయాలని,వారికి పోడు భూములపై హక్కులు కల్పించి న్యాయం చేయాలన్నారు.