Kumuram Bheem Asifabad District: ఆకుల ద్వారా ఆదాయం, అందుకే అడవుల సంరక్షణ మనందరి బాధ్యత: మంత్రి ఇంద్రకరణ్

లబ్ధిదారులకు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2016 నుండి 2021 వరకు తునికి ఆకు సేకరణ నికర ఆదాయం బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. 

Continues below advertisement

అడవుల సంరక్షణ మనందరం బాధ్యతగా తీసుకోవాలని, అడవి శాతం పెంపొందడం వల్ల జీవరాశికి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెంచికల్ పేట్ మండల కేంద్రంలో సోమవారం పెంచికల్ పేట, దహేగాం మండలాల లబ్ధిదారులకు అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2016 నుండి 2021 వరకు తునికి ఆకు సేకరణ నికర ఆదాయం బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
రాష్ట్ర ఏర్పాటు అనంతరం శరవేగంగా అభివృద్ధి
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. అడవిలో లభించే తునికి ఆకులు కూడా మనకు ఆదాయం సంపాదించి పెడుతున్నాయని, అడవిని కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసులకు అవసరమైన చెట్లను నాటి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అడవులను కాపాడి భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేందుకు అందరూ ముందుకు రావాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. 

Continues below advertisement

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుంటూ పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారుల ఖాతాలలో 5వేల నుండి 90 వేల వరకు బోనస్ నిధులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 277.88 కోట్ల రూపాయల బోన‌స్ చెల్లింపు ప్రక్రియ ద్వారా ఈ కార్యక్రమంలో 50 మందికి చెక్కుల పంపిణీ జరిగిందని, లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే బోనస్ డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 2023వ సంవ‌త్సరం తునికాకు సీజ‌న్ లో రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో 225 యూనిట్లలో తునికాకును అట‌వీ అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో అట‌వీ శాఖ విక్రయించడం జరుగుతుందని, జిల్లాలోని 63 వేల 573 మంది  లబ్దిదారులకు 31.58 కోట్లు చెల్లిస్తుండగా, ఒక్క సిర్పూర్ నియోజకవర్గంలోనే 48 వేల 418 మంది లబ్ధిదారులకు రూ.26.98 కోట్లు చెల్లించడం జరుగుతుంది అని తెలిపారు. 


మే నెల చివరి వరకు పూర్తి చేస్తాం
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గంలో 2016 నుండి 2021 వరకు 14 యూనిట్ల ద్వారా 48 వేల మంది కూలీలకు సుమారు 27 కోట్ల రూపాయల రాయల్టీ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సీజ‌న్ లో 2.27 ల‌క్ష‌ల స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకును సేకరించడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని మే నెల చివరి వరకు పూర్తి చేసేందుకు  చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
అడవిలో ఆకుల ద్వారా ఆదాయం 
ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు మాట్లాడుతూ.. అడవి ద్వారా పండ్లు ఫలాలు అందుతున్నాయని, అడవిలో ఆకుల ద్వారా ఆదాయం సమకూరుతుందని, అడవిని కాపాడుకుందాం అని అన్నారు. సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనప్ప మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి తునికి ఆకు కట్టకు 2.05 రూపాయల నుండి 3 రూపాయలు పెంచడం చాలా సంతోషంగా ఉందని, బడుగు బలహీన వర్గాల కూలీలకు ఆదాయం పెంపొందుతుందని, అటవీ సేకరణ యూనిట్ల సంఖ్యను పెంచాలని కోరారు. అడవికి, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సిర్పూర్ లోని భీమన్న గుడి వద్ద అర్బన్ పార్క్ మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు వినోద్ కుమార్, శివ ఆశిష్ సింగ్, మండల ప్రజా పరిషత్ ప్రతినిధి, జెడ్పిటిసి శ్రీదేవి, ఎంపిటిసి లు, సర్పంచులు, సంబంధిత శాఖల అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సి.సి.ఎఫ్. ఆర్.ఎం. డొబ్రియల్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజక వర్గాల శాసనసభ్యులు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. 

Continues below advertisement