ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో గల కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఇటీవల అటవీ శాఖ అధికారులు అటవీ శాఖ చెక్ పోస్ట్ ల వద్ద ఫాస్టాగ్ లను ఏర్పాటు చేశారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్టుల మీదుగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు రాకపోకలు కోనసాగించే వాహనాల నుంచి రుసుం వసూలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ కేంద్రాలపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ భగ్గుమన్నారు. అటవీ శాఖ తీరును తప్పుబట్టారు. తన ఖానాపూర్ నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఫాస్టాగ్ ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో ఫాస్టాగ్ బంద్ చేయాలని ఆదేశించారు.
ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ ఫారెస్ట్ చెక్ వద్ద లోకల్ వాహనాలకు కూడ రుసుం వసూలు చేస్తున్నారని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోరావడంతో ఆయన ఉట్నూర్ కు సమీపంలోని కొత్తగూడ చెక్ పోస్ట్ వద్దకు వెళ్లారు. రుసుం వసూలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఉన్నతధికారులతో ఫోన్ లో మాట్లాడి అధికారుల తీరును తప్పుబట్టారు. లోకల్ ఎమ్మెల్యేగా,(వైల్డ్ లైఫ్ బోర్డ్ మెంబర్) వన్యప్రాణి సంరక్షణ సలహా మండలి సభ్యుడిగా ఉన్న తనను సంప్రదించకుండానే ఫాస్టాగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల వాహనాల నుంచి రుసుం ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. బిర్సయిపేట రేంజ్ అధికారులతో పాటు జిల్లా DFO, మరియు FDPT శాంతారాంతో ఫోన్ లో మాట్లాడారు. తనకు తెలియకుండా ఫాస్టాగ్ కేంద్రాలను ఎలా ఏర్పాటు చేశారని అటవీశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. తాను కూడా వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్ అని నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే కు తెలియకుండా ఫాస్టాగ్ ఎలా ఏర్పాటు చేస్తారన్నారు.
ఖానాపూర్ నియోజకవర్గం మొత్తం మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ మూడు జిల్లాలను కలుపుకొని టైగర్ జోన్ పరిధిలో విస్తరించి ఉందని, తన ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న లైట్ వెహికల్, హెవీ వెహికల్లకు రుసుం నుంచి మినహయించాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుతం పత్తి, సోయా, మొక్కజొన్న, వరి పంటల విక్రయాల కోసం నిత్యం స్థానిక రైతులు వస్తు పోతున్నారు. సామాన్య ప్రజలు ఇతర నిత్య అవసరాల కోసం సైతం వస్తూ వెళ్తుంటారని, చాలా మంది ప్రజలు తన దృష్టికి తీసుకోరావడంతో చెక్ పోస్ట్ వద్ద ఫాస్టాగ్ కేంద్రాన్నీ పరిశీలించడం జరిగిందని, అయితే స్థానికంగా ఉండే ప్రజలు లోకల్ వాహనాల డాటా సేకరించి వాటికి రుసుం మినాహించిన తరువాతనే అటవీ శాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు.
అటవీశాఖపై కూడా తనకు గౌరవం ఉందన్నారు. ఇల్లీగల్ గా ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ కేంద్రాలను వెంటనే మూసివేసి ఉన్నత స్థాయిలో జరిగే నిర్ణయం తరువాతనే ముందుకు వెళ్లాలని సూచించారు. 24గంటల్లో ఈ ఫాస్టాగ్ కేంద్రాలను ముసేయాలని ఎమ్మెల్యే చెప్పడంతో ఫాస్టాగ్ కేంద్రాలను అటవీ శాఖ అధికారులు మూసివేసి యధావిధిగా చెక్ పోస్ట్ లను కొనసాగిస్తున్నారు.