ఖానాపూర్: ఇంటిలో ఉన్న కీడు.. ఊర్లో ఉన్న కీడు అంతా వెళ్లిపోవాలి... జెట్టక్క వెళ్ళిపో.. జెట్టక్క వెళ్ళిపో.. లక్ష్మీదేవి రా.. లక్ష్మీదేవి రా.. ఏంటి.. వింటుంటే వింతగా అనిపిస్తుంది కదూ..! అవును ఇది నిజమే... ఇలా నిర్మల్ జిల్లాలో ఖానాపూర్ గ్రామస్తులు మొత్తం ఊరంతా చిన్న పెద్దలతో కలిసి పాత దుస్తులు వేసుకొని, పాత చీపుర్లు, చాటలతో ఒకరినొకరు కొట్టుకుంటూ ఊరి పొలిమేర్ల వరకు వెళ్ళారు.
ఊరి పొలిమేర వరకు వెళ్లిన గ్రామస్తులు
అందరూ కలిసి ఈ పాత వస్తువులతో.. జెట్టక్క వెళ్లిపో.. లక్షిదేవి రా.. అంటూ కేకలు వేస్తూ నృత్యాలు చేస్తూ.. ఊరి పొలిమేర వరకు వెళ్ళి వాటిని అక్కడే ఊరి పొలిమేరలో పడేశారు. అయితే ఇలా ఎందుకు చేస్తారంటే..? గ్రామానికి పట్టిన కీడు అంటే తెలంగాణ భాషలో కీడు ను జెట్ట చేస్తూ అంటుంటారు. అలా సంప్రదాయంగా జెట్టక్క అంటారు. అయితే గ్రామంలో ఉంటున్న అందరి ఇళ్లలోని కీడు, గ్రామం మొత్తం కీడు అంతా వెళ్ళిపోవాలి... జెట్టక్క తొలగిపోయి ఏడాదంతా ప్రజలంతా సుఖ శాంతులతో జీవిస్తారని, దీర్ఘ కాలిక సమస్యలకు తావుండదని ఈ వింత ఆచారం పలు గ్రామాల్లోనూ కొనసాగిస్తున్నారు.
ఏ సమయంలో నిర్వహిస్తుంటారు..
ఇదే క్రమంలో నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ గ్రామస్తులు... ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ... నమ్ముతూ జేట్ఠక్కను గ్రామపోలిమేరకు దాటించారు. ఖానాపూర్ పట్టణవాసులు ప్రతి ఏటా ఈ ఆచారాన్ని కార్తీక పౌర్ణమి అయ్యాక చివరి వారంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్తులంతా కలిసి తమతమ ఇళ్లలోని పాత వస్తువులతో ఇలా జెట్టక్క వెళ్ళిపో... లక్ష్మీదేవి రా.. అంటూ కేకలు వేస్తూ నృత్యాలు చేస్తూ గ్రామ పొలిమేర వరకు దాటించి వాటిని వదిలేస్తూ ఇలా గ్రామ కీడు వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుందంటూ విశ్వసిస్తున్నారు.