Kanti Velugu in Telangana: కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేయాల‌ని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 18వ తేదీ నుండి వంద రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమంపై వైద్య క‌ళాశాల స‌మావేశ మందిరంలో సమీక్ష నిర్వహించి, అధికారుల‌కు, ప్రజాప్రతినిదుల‌కు మంత్రి దిశా నిర్దేశం చేశారు.


ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... సామూహిక కంటి ప‌రీక్షల ద్వారా ప్రజ‌ల్లో నేత్ర స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే ల‌క్ష్యంతో సీయం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించార‌న్నారు.  ప్రతి ఒక్కరికీ కంటి ప‌రీక్షలు నిర్వహించాల‌నే ఉద్దేశ్యంతో  ప్రణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు. ఈ నెల 12 లోగా మండల పరిషత్‌, మున్సిపాలిటీల్లో సమావేశాలు పూర్తిచేయాలని, 18న నియోజక‌వర్గాలలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూన్‌ నెలాఖరులోగా అందరికీ పరీక్షలు చేయాలని, అవసరమైనవారికి మందులు, కంటి అద్దాలు అందజేయాలని నిర్దేశించారు. 


కంటి వెలుగు క్యాంపులపై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు, కార్యక్రమం స‌క్సెస్ అయ్యేలా క్షేత్రస్థాయిలో ఊరు, వాడల్లో  పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని  సూచించారు.  అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని,  ప్రజా ప్రతినిధులు, అధికారులందరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమ‌న్, జిల్లా పరిషత్ చైర్ ప‌ర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు దివాక‌ర్ రావు, దుర్గం చిన్నయ్య, క‌లెక్టర్ భార‌తీ హోళీకేరి  డీఎంహెచ్ ఓ, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇత‌ర అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీ ఎం హెచ్ ఓ లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం సమీక్ష జరిపారు. జనవరి 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. 
ఇదివరకు నాలుగు సంవత్సరాల క్రితం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పాటు కొనసాగించడం జరిగిందని గుర్తు చేశారు. ఈసారి 100 పని దినాలలోనే పూర్తి చేసేలా సూక్ష్మస్థాయి ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. సెలవులను మినహాయిస్తే సుమారు ఐదు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆయా జిల్లాల జనాభాను బట్టి కంటి వెలుగు శిబిరాల కోసం అవసరమైన బృందాలను పంపిస్తామని, ఇదివరకటితో పోలిస్తే ఈసారి అదనంగా 1500 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత గడువులోగా లక్ష్యం పూర్తి చేసుకునేలా కంటి వెలుగు శిబిరాలను నిర్వహించాలని, ఎక్కడ కూడా అర్ధాంతరంగా ఈ శిబిరాలు నిలిచిపోకుండా బఫర్ టీమ్ లను సైతం అందుబాటులో ఉంచాలని కలెక్టర్లకు సూచించారు.


కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి :
జనవరి 18 నుండి చేపట్టనున్న కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు మున్సిపల్ పట్టణాలతో పాటు అన్ని గ్రామ పంచాయతీలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికి కంటి వెలుగు శిబిరాల్లో నేత్ర పరీక్ష నిర్వహించేలా పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.