Kamareddy District News: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఇంఛార్జీ తహసీల్దార్, ధరణి ఆపరేటర్.. లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. అయితే చనిపోయిన తన పెద్దమ్మ పేరిట ఉన్న భూమిని అతడి పేరు మీదకు మార్చాలంటూ ఆర్జీ పెట్టుకోగా.. సదదు ఇంఛార్జీ ఎమ్మార్వో పది వేల రూపాయల లంచం అడిగారు. అంత ఇచ్చుకోలేనని బతిమాలగా.. చివరకు నాలుగు వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 


అసలేం జరిగిందంటే..?


కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలానికి చెందిన రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ ను కలిశాడు. తన పెద్దమ్మకు ఎవరూ లేకపోవడంతో బాగోగులు తనే చూసుకునేవాడినని.. అయితే ఆమె రెండేళ్ల క్రితం చనిపోయిందని తెలిపాడు. ఆమె పేరిట ఉన్న 37 గుంటల భూమిని త పేరు మీదకు మార్చాలని ఆర్జీ పెట్టుకున్నాడు. దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్ లైన్ ఫీజు రూ. 3 వేలు, దాని తర్వాత లంచం రూపంలో 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నేను సాధారణ రైతును.. నేను అంత లంచం ఇచ్చుకోలేనని బలరాం చెప్పగా.. నాలుగు వేలు అయినా సరే ఇవ్వాల్సిందేనని ఇంఛార్జీ తహసీల్దార్ మానస అన్నారు. ఇష్టం లేకపోయినా సరే అని చెప్పి బయటకు వచ్చాడు రైతు బలరాం. 


తన పెద్దమ్మ పేరిట భూమిని మార్చేందుకు తానెందుకు లంచం ఇవ్వాలని భావించిన బలరాం.. నిజామాబాద్ లోని ఏసీబీ అధికారుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం బలరాం ఇంఛార్జీ తహసీల్దార్ మానసకు.. నాలుగు వేల లంచం అస్తుండగా... ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ విషయాన్ని నిజామాబాద్ ఏసీబీ డీఎస్ప ఆనందర్ కుమార్, ఇన్స్ పెక్టర్లు నగేష్, శ్రీనివాస్ లు తెలిపారు. అయితే లంచం తీసుకున్న ధరణి ఆపరేటర్ మానసపై తదుపరి విచారణ చేస్తున్నామని, ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. 


ఇటీవలే ఏపీలో 8 సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా 20 లక్షల లంచం అడగిన ఏమ్మార్వో..


అనంతపురం జిల్లా డి.హీరేహాల్లో 40 ఎకరాల భూమిని పట్టా చేయడానికి ఏకంగా రూ. 25 లక్షల రూపాయలు లంచం అడుగుతున్నాడని బాధితుడు చెబుతున్నారు. ఎమ్మార్వో ఇలా రూ. 25 లక్షలు లంచం అడుగుతున్నారని బాధితుడు కలెక్టర్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన కలెక్టర్.. భూమికి పట్టా చేసివ్వాలని సదరు ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ చెప్పిన తర్వాత పని కాకుండా ఉంటుందా అని బాధితుడు సంతోషపడ్డాడు. కలెక్టర్ చెబితే చేయాలా.. రూ. 25 లక్షలు ముట్టిన తర్వాతే పనిచేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు ఆ ఎమ్మార్వో. భూమికి పట్టా చేసేది లేదు.. ముందు రూ. 25 లక్షలు కట్టు తర్వాతే పని చేస్తానని తెగేసి చెప్పాడని బాధితుడు తెలిపారు. ఎమ్మార్వో తీరుతో విసిగిపోయిన ఆ బాధితుడు మరోసారి కలెక్టర్ దగ్గరకు వెళ్లి తన ఆవేదన తెలిపాడు.


8 సార్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు.. 


ఈ సారి కూడా కలెక్టర్ సేమ్ టు సేమ్ ఆదేశాలు ఇచ్చారు. భూమిని పట్టా చేయాలని ఆదేశించారు. చెప్పగానే మారిపోతే తను ఎమ్మార్వో ఎలా అవుతాడు, అది రెవెన్యూ విభాగం ఎందుకు అవుతుంది. కలెక్టర్ రెండో సారి చెప్పినా.. ఎమ్మార్వో కాసింత అయినా దిగి రాలేదు. ఇక లాభం లేదనుకుని మరో సారి కలెక్టర్ వద్దకు వెళ్లాడు బాధితుడు. కలెక్టర్ వద్దకు వెళ్లి కలవడం అంటే మాటలు కాదు. ఆయన అపాయింట్ మెంట్ కావాలంటే ఒక్కోసారి కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. వారి వీరి కాళ్ల మీద పడితే కానీ కొందరికి కలెక్టర్ అపాయింట్మెంట్ దొరకదు. బాధితుడు కలెక్టర్ వద్దకు వెళ్లిన ప్రతి సారీ ఇదంతా దాటుతూ కలెక్టర్ ను కలిసి తన బాధను వెళ్లగక్కేవాడు. అలా ఇప్పటికి 8 సార్లు కలెక్టర్ వద్దకు వెళ్లాడు. అయినా ఎమ్మార్వో మాత్రం తన భూమికి పట్టా చేసి ఇవ్వడం లేదని చెబుతున్నాడు బాధితుడు స్థిరాస్తి వ్యాపారి అయిన వెంకటరమణ.