Nizamabad News: ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి తన వద్దనున్న రూ.80 లక్షలు చోరీకి గురయ్యాయని హైరానా సృష్టించారు. రెండు పోలీస్ స్టేషన్ల వద్దకు ప్రయాణికులు, బస్సుతో సహా వెళ్లినా.. సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు ఏం చేయలేక మరో పీఎస్ కు వెళ్లాలని సూచించారు. చేసేదేం లేక అతడు ప్రయాణికులు బస్సు సహా మరో రాష్ట్రానికే వెళ్లిపోయాడు. అసలీ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాయకూర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (నెంబర్ సీజీ 04 ఎన్హెచ్ 535)లో నాందేడ్ కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం తనవద్ద ఉన్న రూ. 80 లక్షలు చోరీకి గురైనట్లు మేడ్చల్ వద్ద గుర్తించారు. వెంటనే బస్సుతో సహా వెళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారు డబ్బులు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. ఇందల్వాయి వద్ద పోయి ఉంటాయని చెప్పడంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని పంపించారు. ప్రయాణికులతో పాటు బస్సును ఇందల్వాయి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ప్రయాణికులతో సహా లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. 


డిచ్ పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సూచన మేరకు బస్సును డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అక్కడ విచారణ చేపట్టగా సుద్దపల్లి శివారులోని కంచెట్టి దాబా వద్ద టీ తాగామని.. అక్కడే డబ్బులు ఉన్న బ్యాగు చోరీకి గురై ఉండవచ్చని బాధితుడు చెబుతున్నాడు. పోలీసులు వెంటనే హోటల్ కి చేరుకొని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. కానీ అక్కడ బస్సులోని కొందరు ప్రయాణికులు కిందకు దిగారని, బాధితుడు అసలు బస్సు నుంచి కిందకు దిగలేదని తేలింది. తెలంగాణ - మహారాష్ట్ర బోర్డర్ లోని ఓ హోటల్ వద్ద భోజనం కోసం ఆగామని.. ఆ సమయంలో ఒకరితో గొడవ జరిగినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించిన డిచ్ పల్లి పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వెనక్కు పంపించి వేశారు. దీంతో ప్రయాణికులు, బస్సుతో సహా అతడు మహారాష్ట్రకు బయలుదేరాడు.  


ఇటీవలే కీసరలో చైన్ స్నాచింగ్..


చైన్ స్నాచింగ్.. ఇటీవల ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. వినిపిస్తోంది. మహిళలు అని లేదు, ముసలివాళ్లు అని లేదు. బంగారం దొరికితే చాలన్నట్లు చేస్తున్నారు చైన్ స్నాచింగ్ దొంగలు. బంగారం ఒంటి మీద పెట్టుకుని రావాలంటేనే ఆడవాళ్లు భయపడిపోతున్నారు. ఎట్నుంచి ఎవరు బైక్ మీద వచ్చి దోచుకెళ్లిపోతారో అని వణికిపోతున్నారు. ఇంటి బయట ముగ్గు వేయాలన్నా, పని చేసుకోవాలన్నా మహిళలు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. 


రంగారెడ్డి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటిబయట పని చేసుకుంటున్న హైమావతి (55) అనే మహిళ మెడలో ఉన్న 5 తులాల పుస్తెల తాడును దుండగుడు దొంగిలించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.