Mancherial News | రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలంగాణ కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy) అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని కాకతీయ కాలనీలో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య లతో కలిసి శనివారం ప్రారంభించారు. తరువాత స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు అందించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వన మహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో మండల తహశిల్దార్ సతీష్ కుమార్, క్యాతన్పల్లి మున్సిపల్ కమీషనర్ రాజులతో కలిసి హాజరయ్యారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మనిషి జీవితంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు ఇతర సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యా రంగ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేశామని’ తెలిపారు.
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సొంత స్థలం కలిగి ఉండి అర్హత గల వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింపజేసి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లు అందించనున్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామని మంత్రి వివేక్ తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయల పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడంతో మరిన్ని రకముల వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్, ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 3 నెలలకు సరిపడా సన్నబియ్యం ను ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు జమచేసి పెట్టుబడి సాయం అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతి గృహం, పలు పాఠశాలలలో భోజనశాల, వంటశాల ఏర్పాటు కొరకు అందిన ప్రతిపాదనలు పరిశీలించి త్వరలోనే అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి చర్యలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాం, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ప్రస్తుతం 70 శాతంగా ఉన్న విద్యార్థుల హాజరు శాతాన్ని 100 శాతానికి పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం 3 వేల నుండి 3 వేల 500 మంది విద్యార్థులు పాఠశాలలలో చేరుతుండగా, ఈ విద్యా సంవత్సరంలో 7 వేల మంది పిల్లలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చేరారని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలను కల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపడుతున్నామని, ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
3 వేల 220 మంది రేషన్ కార్డులకు ఆమోదం
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచడంతో పాటు ఆసుపత్రులలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రేషన్ కార్డుల కొరకు అందిన 3 వేల 967 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత కలిగిన 3 వేల 220 దరఖాస్తులను ఆమోదించినట్లు తెలిపారు. అనంతరం అర్హత గల లబ్దిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.