వర్షాకాలం వచ్చిందంటే చాలు, పర్యాటకులు ఎక్కవగా జలపాతాలను సందర్శించడానికి ఇష్టపడుతుంటారు. కొండలపై పడే వర్షపు నీళ్లు ఈ జలపాతాల ద్వారా కిందికి జాలువరుతాయి. ఆ జలపాతాల్ని చూడటం, నీళ్లలో స్నానం చేయడం పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల సీజనల్‌గా వచ్చే కొన్ని జలపాతాలలో జలకళ సంతరించుకుంది. అదిలాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన పొచ్చర, కుంటాల జలపాతాలకు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకున్న వారు ఈ జల పాతాలను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదు నుంచి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆట్టుకుంటున్నాయి.
పొచ్చెర జలపాతం విశిష్టత:
పొచ్చెర జలపాతం గోదావరీ నదీ ప్రవాహం వల్ల ఏర్పడిన సహజ సిద్ధ జలపాతం. ఈ నది సహ్యాద్రి పర్యతశ్రేణి నుంచి సుమారు 25 మీటర్ల ఎత్తు నుంచి కిందకు ప్రవహిస్తుంది. రాళ్ళపై నుంచి జాలువారే జలపాతాలు, పరిసరాల‌్లో ఉండే ప్రకృతి దృశ్యాలు చూడముచ్చటగా కనిపిస్తాయి.
పోచెర జలపాతం ఏక్కడ ఉంది?
పొచ్చెర జలపాతం ఆదిలాబాద్‌జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో పొచ్చెర గ్రామ సమీపంలో ఉంది. పోచెరా జలపాతం నిర్మల్ బస్టాండ్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం నిర్మల్‌కు 37కిలోమీటర్ల దూరంలో, ఆదిలాబాదు నుంచి 47 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సెలవు దినాల‌్లో అధికంగా వస్తుంటారు. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరిగాయి. ఇటీవలే టీఎస్‌ఆర్టీసీ ఈ ప్రాంతానికి శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ బస్సులు హైదరాబాద్, నిర్మల్, అదిలాబాద్, నిజామాబాద్ బస్టాండ్లు నుంచి అందుబాటులో ఉంటాయి.
కుంతాల జలపాతం ప్రత్యేకత:
కుంతాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. కుంతాల కూడా గోదావరీ నదీ ప్రవాహం వల్ల ఏర్పడిన సహజ సిద్ధ జలపాతం. ఇది కాడెం నదిలో భాగం. ఈ నది సహ్యాద్రి పర్యతశ్రేణి నుంచి సుమారు 45 మీటర్ల ఎత్తు నుంచి కిందకు ప్రవహిస్తుంది. కుంతాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా చెబుతుంటారు. పచ్చని అడవులు, సహజంగా ఏర్పడిన సెలయేర్ల మధ్య కుంతాల జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తుంది.
కుంతాల జలపాతం ఏక్కడ ఉంది?
కుంతాల జలపాతం ఆదిలాబాద్‌జిల్లా నేరేడిగొండ మండలానికి వెళ్లే మార్గంలో కుంతాల గ్రామ సమీపంలో ఉంది. కుంతాల జలపాతం నిర్మల్ బస్టాండ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆదిలాబాద్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటీవలే టీఎస్‌ఆర్టీసీ ఈ ప్రాంతానికి శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ బస్సులు హైదరాబాద్, నిర్మల్, అదిలాబాద్, నిజామాబాద్ బస్టాండ్లు నుంచి అందుబాటులో ఉంటాయి. కుంతాల జలపాతం ప్రముఖ పర్యాటక ప్రాంతం అయినప్పటికీ సరైన దారులు, సదుపాయాలు లేక సందర్శకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుంతాల జలపాతానికి చేరుకోవడానికి 4 కిలోమీటర్లు దట్టమైన అడవి గుండా ప్రయాణించాలి. ఆ తరువాత సుమారు 420 మెట్లు దిగిన తర్వాత కుంతాల జలపాతానికి చేరుకోవచ్చు.
గతంలో ఈ రెండు జలపాతాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉండేది కాదు... ఏబీపీ దేశం దీనిపై స్టోరీ చేసిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ వాళ్లు బస్సు సౌకర్యం కల్పించారు.