Rains in Kumuram Bheem Asifabad District | ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జుర్, దేహేగాం మండలాల్లోని మారుమూల గ్రామాల్లో గల కృష్ణపల్లి, దిందా వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పి శ్రీనివాసరావ్ పలు ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులను సందర్శించి అధికారులను, అప్రమత్తంగా ఉండేలా, ఆపదల్లో సహాయక చర్యలు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో అధికారులు డప్పు చాటింపు వేయించారు. ప్రజలు భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించారు. 


కుమ్రం భీమ్ ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత 
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కుమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 3,4,5 నం.గల మూడు గేట్లను 0.30 మీటర్ల మేరకు ఎత్తి 1941 క్యూసెక్కుల నీటినీ అధికారులు దిగువన వదులుతున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుతం 237.850 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.904 టీఎంసీలలో కొనసాగుతుంది. కుమ్రం భీం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు సూచిస్తున్నారు. 


కడెం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు,పూర్తి స్థాయి నీటి సామ్యర్థం 7.603 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 689.750 అడుగులు, ప్రస్తుత నీటి నిలువ: 5.211 టీఎంసీలు. ఇన్ ఫ్లో 2830 క్యూసెక్కులు, అవుట్ ప్లో 77 క్యూసెక్కులు, దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం కడెం ప్రాజెక్టు, 8, 9, 11 నం. గల మూడు గేట్లను నాలుగు ఫీట్లు ఎత్తి సుమారు 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 


ప్రాజెక్టు నీటి విడుదలతో ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోకి ఎవరూ రావొద్దని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపు ఆదివారం వ్యవసాయ పంటల కోసం ఖానాపూర్ ఎమ్మేల్యే వెడ్మ బోజ్జు చేతుల మీదుగా ప్రాజెక్టు యొక్క కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 


Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ - రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు
వాయువ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దాని ప్రభావంతో రెండు, మూడు రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.