ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ లోకి బోడా కాకర కాయలు తొందరగానే వచ్చేసాయి. ఈ సీజన్ లో బోడ కాకరకాయలకు అధిక డిమాండ్ ఉంది. బోడ కాకరను ఆగాకర.. అడవి కాకర, స్పైని గార్డ్ లేదా జంగ్లీ కరేలా అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎక్కువగా మరాఠీ భాషను మాట్లాడుతుంటారు కాబట్టి వారి భాషలో బోడ కాకరను "కర్టూలే" అని పిలుస్తారు.

ఆదిలాబాద్ జిల్లాలోని మార్కెట్లో బోడ కాకర ప్రస్తుతం కిలో ధర రూ.300 కు విక్రయిస్తున్నారు. ఇది చికెన్ ధర కంటే ఎక్కువగా ఉంది. చికెన్ ధర కిలోకు 210 వరకు ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ లో బ్రాండ్‌పై దాని ధర ఆధారపడి ఉంటుంది. చాలా మంది ప్రజలు బోడ కాకర అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుందని, ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ సీజన్ లో వచ్చే బోడ కాకరకాయల కూర తినడానికి ఇష్టపడతారు. ప్రకృతి సహజ సిద్ధమైన పోషక విలువలు కలిగిన ఈ బోడ కాకర అడవి రకం (జంగ్లీ కరేలా) అడవులు మరియు వ్యవసాయ క్షేత్రాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. 

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు మొహమ్మద్ జబీ అనే వ్యక్తి ఈ బోడ కాకరకాయలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బోడ కాకరకాయల సీజన్ ప్రారంభమైంది. మార్కెట్ లో కిలో ధర రూ.300 ఉందన్నారు. మహారాష్ట్రలోని పాండ్రకవడలోని వ్యవసాయ క్షేత్రాలు మరియు అడవులలో బోడ కాకరను సేకరించే వ్యక్తుల నుండి కొనుగోలు చేసి ఆదిలాబాద్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని అన్నారు. దిగుబడి మెరుగుపడినప్పుడు జూలై మరియు ఆగస్టులో ధరలు తగ్గుతాయన్నారు. ఆర్టీసీ డిపో ముందు అరటి పండ్లు కూరగాయలు ఇలా అమ్ముకుంటూ తాను జీవనం కొనసాగిస్తున్నానన్నారు. ప్రతిసారి ఈ సీజన్ లో బోడ కాకరకాయలతో మంచి ఉపాధి ఉంటుందని, ప్రస్తుతం అడవుల్లో గ్రామాల్లో సేకరించి తీసుకువచ్చిన వారి వద్ద బోడ కాకరకాయలను కిలో రూ.260 కి కొనుగోలు చేసి మార్కెట్లో రూ.300 వరకు విక్రయిస్తున్నానని, రోజు కూలి రిత్యా మంచి లాభం ఉందన్నారు. బోడకాకరలను సేకరించి తీసుకువచ్చే వారికి, మార్కెట్ లో విక్రయించే తమకు ఈ సీజన్ లో మంచి ఉపాధి అన్నారు.

బోడ కాకరకాయల్లో పోషక విలువలు కలిగి ఉంటాయని, వీటి విలువ మరియు ఆరోగ్యానికి తగినట్లుగా, ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్, ఒబ్సీ టై మరియు ఇతర ఆరోగ్య కాండి-టయ్స్‌లతో బాధపడుతున్న రోగులు, ప్రజలు సాధారణంగా బోడా కాకర కాయల కూరను తింటే ఆరోగ్యం బాగుంటుందని, జీర్ణ క్రియ మెరుగుపడుతుందని, ఈ బోడ కాకరకాయ కూర రుచి చాలా బాగుంటుందని అతి ఇష్టంగా ప్రజలు తింటారు. 

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని పేన్ గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈ బోడ కాకరకాయలు అత్యధికంగా లభ్యమవుతాయి. పస్సి పార్డి తెగకు చెందిన వారు వీటిని ఈ సీజన్ లో ఉపాధిగా ఎంచుకుంటారు. అదనంగా, కొంతమంది రోజువారీ వేతన కార్మికులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల్లో అలాగే ఎక్కువగా బేల, సాత్నాలతో పాటు సరిహద్దులో ఉన్న పాఠన్ బోరీ, మాండ్వికి దగ్గరగా ఉన్న ఉన్కేశ్వర్ సమీపంలో ఉన్న అడవుల నుండి బోడ కాకరకాయలను సేకరిస్తారు. ఈ సీజన్లో పేన్ గంగానది పరివాహక ప్రాంతాల్లో అడవుల్లోకి వెళ్లి ఈ బోడకాకరకాయలను సేకరించి ఆదిలాబాద్ మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయిస్తారు. పోషక విలువలు రుచికరమైనటువంటి ఈ బోడ కాకరకాయల కూర చాలా బాగుంటుందని, ఈ సీజన్లో అత్యధికంగా అందరూ తింటుంటారు. చికెన్ మటన్ కంటే ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ప్రజలు ఈ సీజన్ లో దొరికే బోడ కాకరకాయలను ఎక్కువగా తింటారు.