ఉచిత ఆర్చరీ శిక్షణ ఆ గ్రామస్థులకు వరంగా మారింది. ధనిక, పేద తేడా లేకుండా అందరికీ అక్కడ విలువిద్యలో రాటుదేలుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. కామారెడ్డి జిల్లా దొమకొండకోటలో ఉచిత ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ ఎంతో మందిని తీర్చుదిద్దుతోంది. కామినేని వంశీయుల ఆధీనంలో ఉన్న దొమకొండ కోటకు ఎంతో చరిత్ర ఉంది. అలాంటి ప్రదేశంలో కామినేని అనిల్, శోభ దంపతులు ఉచిత ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
2007 నుంచి ఇక్కడి విద్యార్థులకు విలువిద్యను ఉచితంగా అందిస్తున్నారు. చాలా మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. విలు విద్య చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక్క విల్లు కొనాలంటే దాదాపు లక్ష రూపాయలకుపైగా ఉంటుంది. అలాంటిది అనిల్, శోభ దంపతులు దొమకొండ గ్రామస్తుల కోసం ఖరీదైన ఈ ఆర్చరీలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రత్యేకంగా కోచ్‌ను నియమించారు. కోచ్‌కు వసతి, జీతం అనిల్, శోభ దంపతులే ఇస్తున్నారు. కోచ్ ప్రతాప్ దాస్ 15 ఏళ్ల క్రితం కోల్‌కతా నుంచి వచ్చారు. దొమకొండ నుంచి 25 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతాప్ దాస్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 600 మంది విలువిద్య నేర్చుకున్నారని కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు. బ్యాంకాక్ లో 2019లో జరిగిన ఏషియా కప్ స్టేజ్-1లో కే. సింధుజ ఎంపికయ్యారు.
తొలిసారిగా 2008లో స్టేట్ మీట్‌లో 2 బంగారు, 2 సిల్వర్ పథకాలు గెలుచుకోవటంతో సత్తా చాటారు ఇక్కడి విద్యార్థులు. నేషనల్ లెవల్ లో ఇప్పటి వరకు 25 గోల్డ్ మెడల్స్, 25 సిల్వర్ మెడల్స్..స్టేట్ లెవల్‌లో 12 గోల్డ్, 30 సిల్వర్ మెడల్స్ గెల్చుకున్నారు. గత 15 సంవత్సరాలలో దొమకొండ నుంచి ఇప్పటి వరకు 40 నుంచి 50 వరకు నేషనల్ ఆర్చరీ అథ్లెటిక్స్‌కు సెలక్ట్ అయ్యారు. త్వరలో పంజాబ్‌లో జరగబోయే నేషనల్ ఒలంపిక్స్‌కు కే.సింధుజ సెలక్ట్ అయ్యారు.
సింధుజ ఆర్చరీలో రాణిస్తుండటం చాలా సంతోషంగా ఉందంటున్నారు సింధుజ తండ్రి మోహన్ రెడ్డి. దొమకొండ కోటలో ఉచితంగా విలువిద్య నేర్పిస్తుండటం ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. సింధుజ లాగా చాలా మంది అమ్మాయిలో క్రీడల్లో రాణించాలని అంటున్నారు. ఉచిత శిక్షణ ఇస్తున్న అనిల్, శోభకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
కామినేని వంశస్దుల ఆధీనంలో ఉన్న దొమకొండలోని చారిత్రాత్మక కోటలో ఉచిత ఆర్చరి శిక్షణ ఎంతో మంది పేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచే కాదు రాజస్థాన్ నుంచి సైతం ఇక్కడి వచ్చి కోచ్ ప్రతాప్ దాస్ వద్ద శిక్షణ పొందుతున్నారు.
Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!