Case Filed Against KTR | ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్ట్ లో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం, ఇందులో ₹25000 కోట్లు ఢిల్లీకి పంపారు అని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెక్షన్ 352, 353(2), 356(2) BNS కింద కేసులు నమోదయ్యాయి. 


కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క


కాంగ్రెస్ పార్టీపై ప్రతికార ప్రచారం చేస్తున్న బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అక్టోబర్ 3న ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు అక్టోబర్ 14వ తేదీన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.


రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నేరపూరిత కుట్ర,నిరాధారమైన,నిర్లక్ష్య పూరిత ఆరోపణలు కేటీఆర్ చేస్తున్నారని, నవంబర్ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగటాన్ని బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తూ... రాష్ట్ర పాలనలో రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అని సుగుణక్కఅన్నారు.


మూసీ ప్రక్షాళన విషయంలో బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మూసినది ప్రక్షాళన కోసం ఇంకా డిపిఆర్ రూపొందించలేదని, అవినీతి ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను తగ్గించే ఉద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం బిఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నుతుందని, వారు చేస్తున్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని స్పష్టం చేశారు.


Also Read: Telangana News: సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?