Kamareddy Master Plan Issue :  కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది.  కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ భూములు కోల్పోతున్న రైతులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  మాస్టర్ ప్లాన్ నిర్ణయంతో బుధవారం  రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాజీనామా చేశారు. ఉపసర్పంచ్ సహా ఆరుగురు వార్డు మెంబర్లు, పిఏసీఎస్ డైరెక్టర్, ఆరుగురు గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు రాజీనామా చేశారు. రైతుల భూములను లాక్కునే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  


కామారెడ్డి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లిన రైతులు 
 
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు తెలిపారు. రైతుల ధర్నా కొనసాగుతోంది. రాములు మృతికి సంతాపంగా రైతులు మౌనం పాటిస్తుండగా అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త జనార్దన్ రెడ్డి వారు దాడికి యత్నించారు. రాజీనామా చేయకుండా ర్యాలీ వద్దకు ఎందుకు వచ్చావంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను సముదాయించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన రైతులు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బారికేడ్లు దాటిలోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.   ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 


హైదరాబాద్‌లో స్పందించిన మంత్రి కేటీఆర్ 


కామారెడ్డి మాస్ట‌ర్ ప్లాన్ నిర‌స‌న‌ల‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కామారెడ్డి జిల్లాలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను ఆ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్‌ను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.  అసలు మాస్టర్ ప్లాన్ ఏంటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం గురించి తనకు తెలియదని చెప్పారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజీలో ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం ప్రకారం మార్పులు చేర్పులు చేస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు.


రైతుల్ని ఇబ్బంది పెట్టేలా ఏ నిర్ణయమూ తీసుకునేది లేదన్న కేటీఆర్ 


కేవ‌లం మాస్ట‌ర్ ప్లాన్ ముసాయిదా మాత్ర‌మే ఇచ్చార‌ని కేటీఆర్ తెలిపారు. ప్ర‌జ‌ల కోణంలోనే ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అభ్యంత‌రాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. విన‌తులు, అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని విష‌యాలు వివ‌రించాల‌ని సూచించారు. 500 ఎక‌రాలు ఇండ‌స్ట్రీయ‌ల్ జోన్‌కు పోతోంద‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. భూమి పోతుంద‌ని ఓ రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పత్రిక‌ల్లో చూశాన‌ని తెలిపారు. ఈ ప్ర‌భుత్వం రైతుల‌ను ఇబ్బంది పెట్టేందుకు లేద‌ని స్ప‌ష్టం చేశారు. నిర్మాణాత్మ‌క న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల అభివృద్ధి కోస‌మే మాస్టర్ ప్లాన్ చేశామ‌న్నారు. మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండాలి.. వ్య‌తిరేకంగా ఉండొద్దు అని కేటీఆర్  కామారెడ్డి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.