DRG Forces : ఛత్తీస్‌గఢ్‌ దశాబ్ధాలుగా మావోయిస్టులకు, పోలీసులకు మధ్య వార్ జరుగుతూనే ఉంది. గతంలో ఈ వార్‌లో మావోయిస్టులు పై చేయి సాధిస్తే,  ఇప్పుడు మాత్రం భద్రతా బలగాలపై చేయి సాధిస్తున్నాయి.  ఇందుకు కారణం గెరిల్లా వార్‌ఫెర్. నిత్యం అటవీ ప్రాంతంలో ఉండే మావోయిస్టు సైన్యం ఏన్నో దశాబ్ధాలుగా ఈ యుద్ధ తంత్రంలో ఆరి తేరింది. కానీ పోలీసులకు మాత్రం ఈ నైపుణ్యం అలవడలేదు. మైదాన ప్రాంతాల్లో పోరాడిన అనుభవంతో అడవిలోకి అడుగుపెట్టిన ఈ బలగాలు చాల సందర్భాల్లో ఓటమిని ఎదుర్కొన్నాయి. అయితే ఈ  బలహీనతను ఛత్తీస్‌గఢ్‌ భద్రతా బలగాలు డీఆర్జీ దళాల ద్వారా అధిగమించాయి. మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ఈ దళాలు ముందంజలో ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

డీఆర్జీ దళాల  ఏర్పాటు వెనుక కారణాలు

డీఆర్జీ అంటే డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్. దీన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు.  పోలీసుల్లో వీరు అంతర్భాగమే. కాకపోతే వీరు మావోయిస్టులపై పోరాడటానికి ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన యూనిట్ గా గుర్తిస్తారు. గెరిల్లా యుద్ధతంత్రంతో  పోలీసులపై ఆధిపత్యం వహించే మావోయిస్టులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సరి కొత్త ఛత్రం డీఆర్జీ దళాలు. సంప్రదాయ యుద్దరీతులను పాటించే పోలీసు బలగాలు ఎదుర్కొన్న సవాళ్లకు సమాధానమే గెరిల్లా వార్‌ఫెర్‌లో ఆరి తేరిన డీఆర్జీ దళాలు.

డీఆర్జీ దళాల ప్రత్యేకత  స్థానిక బలమే.

డీఆర్జీ దళాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజన యువతనే చేర్చుకుంటారు. అడవులు, గిరిజన సంప్రదాయాలు, గిరిజన  భాష, తమ ప్రాంతంపై ఉన్న అపారమైన పరిజ్ఠానం, అడవుల్లో సంచరించే నైపుణ్యం, పుట్ట, చెట్టుపై వారికి ఉన్న  అవగాహనే  ఈ దళానికి కీలకమైన బలంగా చెప్పవచ్చు.  నిఘా సమాచార సేకరణలో స్థానికత  వారికి ఎంతో ఉపయోగపడింది. ఇదే మావోయిస్టు ఆపరేషన్లలో విజయం సాధించడానికి కీలకమైనదిగా మారింది.  మా ప్రాంత ప్రజలను మేం  మావోయిస్టుల నుంచి కాపాడుకుంటున్నాం అన్న స్ఫూర్తిని వారిలో పోలీసు బలగాలు నింపుతున్నాయి. దీంతో ఇందులో చేరే వారు మావోయిస్టులకు వ్యతిరేకంగా తుపాకి పట్టి వెనక్కు తగ్గకుండా పోరాడుతున్నారు.  గిరిజన యువతను డీఆర్జీ దళాల్లో చేర్పించడం, దళాల్లో చేరలేని వారిని తన నిఘాకు ఇన్ ఫార్మర్లుగా వాడుకోవడం, గిరిజన యువతకు ప్రభుత్వపరంగా ఉపాధి కలిగించడం వంటి చర్యలతో, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంత యువత నక్సల్స్‌లో చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో  మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్ జరగడం కష్టమైపోయింది. అంతే కాకుండా మావోయిస్టుల్లో ఆ ప్రాంతం నుంచి పోరాడుతున్న వారి ఆసుపాసులు కనిపెట్టేలా, వారి బలం బలహీనతలను అర్థం చేసుకోవడంలో డీఆర్జీ దళాల్లో ఉన్న పని చేస్తున్న స్థానిక యువతకు సుళువైన విషయంగా మారింది.

సల్వా జుడుం మారు రూపమే డీఆర్జీ

2005లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీని ఎదుర్కోవడానికి ముఖ్యంగా దంతేవాడలో ఈ సల్వాజుడం అనే సంస్థ ఏర్పాటైంది. ఇది మావోయిస్టులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించేంది. సల్వాజుడుం అనే మాటకు అర్థం గొండి భాషలో శాంతియాత్ర అని అర్థం. దీనికి ప్రభుత్వం మద్దతు పలికింది. పోలీసులు ఇందులో చేరిన సల్వాజుడుం కార్యకర్తలకు ఆయుధాలు ఇచ్చి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో వినియోగించుకునే వారు. వారు భద్రతా దళాలకు మార్గనిర్దేశనం చేయడం, మవోయిస్టుల సమాచారం సేకరించి పోలీసులకు అందించడం, కొన్నిసార్లు ఎన్ కౌంటర్లలో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగేది. కొన్నేళ్లకు ఈ సల్వాజుడుం కార్యక్రమాలు వివాదాస్పదంగా మారాయి. మానవహక్కుల ఉల్లంఘనకు ఈ సంస్థ పాల్పడుతుందన్న విమర్శలు వచ్చాయి. చివరకు ఇది సుప్రీంకోర్టుకు చేరింది. సల్వాజుడుం అనే సంస్థ రాజ్యాంగ విరుద్దమని సుప్రింకోర్టు తీర్పు ఇవ్వడంతో మూసివేయడం జరిగింది. ఆ తర్వాతే  ఈ సల్వాజుడుం అనే సంస్థ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థగా రూపొందింది. స్థానిక గిరిజన యువతతో కూడిన డీఆర్జీగా రూపాతంరం చెందింది. సల్వాజుడుం నుంచి పాఠాలు నేర్చుకున్న పోలీసులు డీఆర్జీని పటిష్టం చేశారు. రాజ్యాంగబద్దంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంత గిరిజన యువతను పోలీసు బలగాల్లోకి తీసుకుని  వారిని పటిష్టమైన శక్తిగా మార్చారు.  వీరంతా ఛత్తీస్‌గఢ్‌ పోలీసు బలగాల్లో భాగం. వీరిని డీఐజీ, ఐజీ, జిల్లా స్థాయిల్లో ఎస్పీలు పర్యవేక్షిస్తారు.

గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నే దళమే డీఆర్జీ

దట్టమైన అడవిలో మావోయిస్టులు  కూంబింగ్ చేపట్టే పోలీసు బలగాలపై అనూహ్య దాడులు చేస్తారు. ఇలాంటి జంగిల్ వార్ ఫెర్‌లో అనుభవం లేక చాలా సార్లు భద్రతా బలాగాలు  మావోయిస్టుల యుద్ధతంత్రం ముందు చేతులెత్తేసేవి. ఈ క్రమంలో జంగిల్ వార్ ఫేర్ ను అర్థం చేసుకున్న పోలీసు యంత్రాంగం తన వ్యూహం మార్చుకుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న వ్యూహంతో , ఈ గెరిల్లా వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో దాడులు చేసే శక్తిగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు డిస్ట్రిక్ రిజర్వు గార్డులను తీర్చిదిద్దారు. గెరిల్లా యుద్ద పద్ధతులు, ప్రతి దాడి చేసే వ్యూహాల్లో వారిని సుశిక్షితులను చేశారు. ఆధునిక ఆయుధాలు వాడటం నేర్పించారు. కమ్యూనికేషన్, నిఘా పరికరాలను సమర్థవంతంగా వాడటంలో శిక్షణ ఇచ్చారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజీవ్ డివైసెస్ (IED) లను గుర్తించడం, గుర్తించిన వాటిని నిర్వీర్యం చేయడం, నేర్పించారు. అయితే సాధారణంగా అప్పటికే స్థానిక యువతకు అటవీ పరిస్థితులు, స్థానిక అంశాల పట్ల అవగాహన ఉండటంతో పోలీసు శిక్షణలో వీరు మరింత రాటు దేలారు. అంతే కాకుండా  శారీరక, మానసిక దృఢత్వం పెరిగాలా వారి శారీరక, మానసిక స్థాయిలను పెంచే శిక్షణను ఇప్పించారు. అటవీ ప్రాంతాల్లో జీపీఎస్ ను ఉపయోగించి మార్గాలను గుర్తించడం, కిష్టమైన పరిస్థితులు ఎదురయితే అడవిలో తప్పిపోకుండా నావిగేషన్ నైపుణ్యాన్ని సంతరించుకోవడం వంటి వాటిలో శిక్షణ ఇప్పించారు. దీంతో పాటు కఠినమైన భూభాగాల్లో  రాత్రంతా ఇరవై ఐదు నుంచి ముఫ్ఫై ఐదు కిలోమీటర్లు ఆయుధాలతోను, కిట్ బ్యాగ్ లతో నడిచేలా శారీరక  దృఢత్వం, సహనం పెంచేలా ట్రైన్ చేశారు.  ప్రాణాపాయం ఎదురయినా శత్రువుకు లొంగిపోకుండా మరింత శక్తివంతంగా పోరాడి విజయం సాధించేలా మానసిక శిక్షణను ఈ దళాలకు అందించారు. ఏ పరిస్థితుల్లో అయినా మానసిక స్థైర్యం కోల్పోకుండా తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తివంతులుగా  ఈ దళాలను రూపొందించారు. ఆపరేషన్స్ జరిగినప్పుడు గాయపడినా, ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నా తమకు తాము ప్రాథమిక చికిత్స చేసుకునే రీతిలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ అంతా ఛత్తీస్‌గఢ్‌లోని కౌంటర్ అండ్ జంగిల్ వార్ ఫెర్ కాలేజిలో వీరికి ఇవ్వడం జరిగింది.

డీఆర్జీ దళాల మావోయిస్టులపై సాధించిన విజయాలు ఇవే

మావోయిస్టు అగ్రనేతల అంతమే పంతంగా డీఆర్జీ దళాలు పని చేయడం ప్రారంభించాయి. పటిష్టమైన నిఘా, స్థానిక అంశాలపై పట్టు, అటవీ యుద్ధ నైపుణ్యాలతో వీరు మావోయిస్టులను ఎదుర్కొన్నారు.  ఈ క్రమంలో అనేక కీలక మావోయిస్టు అగ్రనేతలను ఎన్ కౌంటర్లలో మట్టుబెట్టారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్‌కౌంటర్ మే 21, 2025లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 28మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్జీ దళాలు కీలక పాత్ర పోషించాయి. అత్యంత కచ్చితమైన సమాచారం సేకరించడంతో పాటు, కూంబిగ్ ఆపరేషన్లో పాల్గొని మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావుతో సహా మరో 27 మందిని  ఎన్ కౌంటర్లో కాల్చి చంపాయి.  నక్సల్స్ చరిత్రలో  మావోయిస్టు జనరల్ సెక్రటరీ సమాచారం సేకరించడం, ఆయన వద్దకు చేరుకోవడం, ఆ తర్వాత భౌతికంగా మట్టుబెట్టడం ఇదే తొలిసారి.  ఇందులో కీలక పాత్రదారులు డిస్ట్రిక్ రిజర్వు గార్డ్స్ . నంబాల కేశవరావుతోపాటు  అనేక మంది కీలక నేతలను డీఆర్జీ దళాలు కాల్చి చంపాయి. జోనల్ కమాండర్లు, డివిజనల్ కమాండర్లు, ఏరియా కమాండర్లు, కీలక అగ్రనేతలను తుద ముట్టించడంలో డీఆర్జీ దళాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొన్నాయి. అంతేకాదు నిరంతర కూంబింగ్ వల్ల క్షేత్రస్థాయిలో నక్సల్స్ బలహీనపడ్డారు. కొత్త రిక్రూట్మెంట్లు ఆగిపోయాయి. డీఆర్జీ దళాల ఒత్తిడితో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోయారు.

బస్తర్ శక్తికి ప్రతీకగా  "దంతేశ్వరి లడకే"  పేరుతో మహిళా డీఆర్జీ ఏర్పాటు

డీఆర్జీలో మహిళా యూనిట్లను 2019లో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఏర్పాటు చేశారు., "దంతేశ్వరి లడకే" (దేవి దంతేశ్వరి యోధులు)  అనే పేరు పెట్టారు. బస్తర్ ప్రాంతంలో దంతేశ్వరీ దేవిని పూజిస్తారు. అందుకే  ఈ పేరును మహిళా యూనిట్ కు పెట్టారు. ఇదే మొదటి మహిళా కమాండో యూనిట్. దీన్ని దంతేవాడ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇందులో లొంగిపోయిన మాజీ మాహిళా మావోయిస్టులను, మాజీ సల్వాజుడుం సభ్యులను, స్థానిక గిరిజన యువతులతో కలిపి ఏర్పాటు చేశారు. వీరు కూడా పురుష కమాండోలతో  సమానంగా ఎన్ కౌంటర్లు, కుంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటారు. వీరి ముఖ్య విధి ఏంటంటే సామాన్యులుగా  గ్రామాల్లో ప్రజలతో కలిసిపోతారు. స్థానిక ప్రజలకు సాయం చేయడం, సమస్యలు వస్తే అండగా ఉండటం, పోలీసుల పట్ల నమ్మకాన్ని కలిగించడం వంటి పనులు చేస్తూ ప్రజల్లో ఒకరిగా ఉంటారు. ఇలా వారు మావోయిస్టులకు సంబంధించిన నిఘా సమాచారం అత్యంత రహస్యంగా సేకరిస్తారు. మావోయిస్టుల కదలికలు, వారి స్థావరాలు, వారికి సాయం చేసే కొరియర్ వ్యవస్థల గుట్టును తెలుసుకుంటారు. దీంతోపాటు మహిళా మావోయిస్టుల అరెస్టు, లేదా వారికి సహాయం చేసే మహిళలను అరెస్టు చేసే సమయంలో వీరు కీలక పాత్ర వహిస్తారు. బయట నుంచి  మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న ప్రచారం జరగకుండా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మహిళా యూనిట్ ఏర్పాటుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నది డీఆర్జీ దళాల

మావోయిస్టులను అడ్డుకునే ఆపరేషన్లలో విజయాలు సాధించినా, డీఆర్జీ దళాలు కూడా తమ సహచరులను పెద్ద ఎత్తున కోల్పోయాయి.

  • 2023, ఏప్రిల్26 - దంతేవాడ దాడి - ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో జరిగిన ఒక భారీ ఐఈడీ పేలుడులో 10 మంది డీఆర్జీ సిబ్బంది, ఒక స్థానిక డ్రైవర్ అమరులయ్యారు. ఇది డీఆర్జీకి బస్తర్ ప్రాంతంలో సంభవించిన అతి పెద్ద ప్రాణనష్టంగా నమోదైంది. ఈ దాడిలో చనిపోయిన డీఆర్జీ సిబ్బందిలో ఐదుగురు మాజీ మావోయిస్టులు కూడా ఉన్నారు.

 

  • 2025 జనవరి6 - బీజాపూర్ దాడి-  బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన సుమారు 70 కిలోల ఐఈడీ పేలుడులో 8 మంది డీఆర్జీ సిబ్బంది వారితోపాటు స్థానిక డ్రైవర్ మృతి చెందారు. ఇది రెండేళ్లలో భద్రతా బలగాలపై జరిగిన అతి పెద్ద దాడి.

 

  • 2025 మార్చి20 - బీజాపూర్/కాంకర్ ఎన్ కౌంటర్ - బీజాపూర్, కాంకర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్‌లలో 30 మందికిపైగా మావోయిస్టులు మరణించగా, ఒక డీఆర్జీ జవాన్ చనిపోయారు. 

 

  • 2025 మే21 - నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ - మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును హతమార్చిన ఎన్ కౌంటర్‌లో ఒక డీఆర్జీ జవాన్ సైతం మరణించారు. ఇలా కీలకమైన ఆపరేషన్లలోను, మావోయిస్టుల దాడుల్లోను మొదట బుల్లెట్ దిగుతోంది మాత్రం డీఆర్జీ దళాల్లోని వారికే.

ఛత్తీస్‌గఢ్‌ డీఆర్జీ దళాలపై ఆరోపణలు కూడా ఎన్నో ?

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో  వారితో పోరాడేందుకు ప్రత్యేక దళాలను ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్ దళాలు ఏర్పాటు అయ్యాయి.  ఒడిశా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా నక్సలిజం  రూపుమాపేందుకు ప్రత్యేక దళాలు ఉన్నాయి. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో డీఆర్జీ దళాలు గణనీయమైన విజయాలు సాధించినా, ఆ మేరకు ప్రాణ నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే నక్సల్ ఏరివేత ఆపరేషన్లలో పాల్గొన్న ఈ దళంపై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డీఆర్జీ దళాలపై వస్తోన్న ప్రధాన ఆరోపణలు ఇవే

నకిలీ ఎన్ కౌంటర్లు - స్థానిక అమాయక గిరిజనులను మావోయిస్టుల పేరుతో డీఆర్జీ దళాలు ఎన్ కౌంటర్లు చేసి చంపుతున్నాయన్న ప్రధాన ఆరోపణ వీరిపై ఉంది. అటవీ, గిరిజన ప్రాంతాల్లో జరిగే ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు పారదర్శకంగా జరగకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మావోయిస్టులకు సహకరిస్తున్నారని కొద్ది మంది అమాయకులను నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆస్తుల విధ్వంసం, దోపిడీ ఆరోపణలు- కొన్ని గ్రామాల్లో డీఆర్దీ దళాలు గ్రామాల్లోకి వెళ్లి మావోయిస్టుల సెర్చింగ్ పేరుతో దౌర్జన్యాలకు పాల్పడటం, సహకరించని వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

లొంగిపోయిన మావోయిస్టుల నియామకంపై విమర్శలు - డీఆర్జీలో లొంగిపోయిన మావోయిస్టులను చేర్చుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో వీరు  చేసిన నేరాలకు న్యాయస్థానాల్లో శిక్షలు వేయించాల్సింది పోయి, వారికి గిఫ్ట్ గా  ప్రభుత్వ ఉద్యోగాలు అంటే డీఆర్జీ దళాల్లో చేర్చుకోవడం ఏంటన్న విమర్శలు ఉన్నాయి. ఈ నియామకాలు కూడా  వృత్తి పరంగా అర్హత లేనివిగా విమర్శలు వస్తున్నాయి.

స్థానిక గిరిజనుల మధ్య విభేదాలు- డీఆర్జీ దళాల్లో స్థానిక గిరిజన యువతనే  మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ల కోసం తీసుకోవడం వల్ల ఇది ఆదివాసీల మధ్య విభేదాలకు దారి తీస్తోందన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అటు మావోయిస్టుల చేతిలో డీఆర్జీలో ఉండి పని చేసే గిరిజనుడు చనిపోతున్నాడు. ఇటు డీఆర్జీ దళాల చేతుల్లో కూడా మావోయిస్టుల్లో ఉండి పని చేస్తోన్న గిరిజనులే చనిపోతున్నారన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ విషయంలో గిరిజన గ్రామాల్లో, కుటుంబాల్లో స్వంత అన్నదమ్ముల మధ్య విభజన రేఖ గీస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోరాటంలో తమ గిరిజనులే బలిపశువులుగా మారుతున్నారన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

పారదర్శకత, జవాబుదారీతనం లేని ఆపరేషన్లు -  డీఆర్జీ దళాలు చేస్తోన్న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లపైన విమర్శలు వస్తున్నాయి. వీటిలో పారదర్శకత లేదని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్లపై స్వతంత్ర దర్యాప్తులు జరగకపోవడం వల్ల ఈ దళాలు విచ్చలవిడిగా  అటవీ గ్రామాల్లో ప్రవర్తిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.  అయితే ఈ ఆరోపణలన్నింటినీ అటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, ఇటు పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. మావోయిస్టులే వెనుక ఉండి ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఈ ఆరోపణలను తిప్పికొడుతున్నారు.